Oct 14,2023 00:01

హెల్త్‌ క్లినిక్‌ సెంటర్ల అద్దె చెల్లించలేకపోతున్నాం.. ఎమ్మెల్యేకు ఎమ్‌ఎల్‌ హెచ్‌పిలు వినతి


హెల్త్‌ క్లినిక్‌ సెంటర్ల అద్దె చెల్లించలేకపోతున్నాం..
ఎమ్మెల్యేకు ఎమ్‌ఎల్‌ హెచ్‌పిలు వినతి
ప్రజాశక్తి -కోట : మండల పరిధిలోని హెల్త్‌ క్లినిక్‌ సెంటర్‌ లకు అద్దె కట్టలేకపోతున్నామని కోట సచివాలయం పరిధిలోని పలువురు కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌) గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌ రావు ముందు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తో వారు మాట్లాడుతూ అద్దె రూములో ఉంటూ పలు రకాలుగా సేవలు చేస్తున్నామని, తమకు వచ్చే కొద్దిపాటి వేతనంలో అద్దెకు ఉండే హెల్త్‌ క్లినిక్‌ సెంటర్‌లకు అందరం కలిసి ప్రతినెలా అద్దె చెల్లించడం కష్టతరంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే తమకు న్యాయం జరిగేలా చూడాలని తమ గోడును ఎమ్మెల్యే ముందు వెళ్లబుచ్చుకున్నారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేస్తామని వారికీ హామీ ఇచ్చారు.