Feb 16,2023 23:56

నగదను అందజేస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు: ఆకస్మికంగా మృతి చెందిన కాంట్రాక్ట్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ కుటుంబానికి సహౌద్యోగులు, పలువురు దాతలు ఆర్థిక సహాయాన్ని అందించి ఆసరాగా నిలిచారు. జిల్లాలోని పాడేరు డివిజన్‌ పెదబయలు మండలం కిముడుపల్లి ఆరోగ్య ఉప కేంద్రంలో పని చేస్తున్న కాంట్రాక్టు పారామెడికల్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ కోడా గోపాల్‌రావు అకాల మరణం పొందిన సంగతి విధితమే. దీనిపై స్పందించిన కాంట్రాక్ట్‌ పారామెడికల్‌ వైద్య ఆరోగ్య ఉద్యోగుల యూనియన్‌ తరపున గోపాలరావు కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు పలువురు సహ ఉద్యోగులు, దాతలు ముందుకు వచ్చారు. యూనియన్‌ నాయకులు శెట్టి నాగరాజు, లక్ష్మణ్‌రావు వాట్సాప్‌ ద్వారా తోటి మిత్రులకు సమాచారం ఇచ్చి రూ.76,504 ఆర్థిక సాయాన్ని గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు అప్పలనర్స ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ చేతుల మీదుగా గోపాలరావు కుటుంబానికి అందజేశారు. గిరిజన సంఘం నాయకులు అప్పల నర్స, పాలికి లక్కు జిల్లా కలెక్టరుకు గోపాలరావు కుటుంబం దీన పరిస్థితిని వివరించారు. స్పందించిన జిల్లా కలెక్టర్‌ వెంటనే రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని గోపాలరావు సతీమణికి అందించారు. కొద్ది రోజుల్లో తాత్కాలిక ఉద్యోగం ఇచ్చేందుకు చూస్తామని లేదా రెండు లక్షల నుండి 5 లక్షల వరకు బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తానని జిల్లా కలెక్టర్‌ హామీ ఇచ్చారు.