Nov 05,2022 23:50

పారిశుధ్య కార్మికుల ధర్నాలో మాట్లాడుతున్న మూర్తి

ప్రజాశక్తి -భీమునిపట్నం : పారిశుధ్య కార్మికుల వేతనాల నుంచి హెల్త్‌ అలవెన్సులను రికవరీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిఐటియు జోన్‌ కార్యదర్శి ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక జోనల్‌ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులు జరిపిన పోరాట ఫలితంగా హెల్త్‌ అలవెన్సును కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే వారి అలవెన్సులను జీతాల నుంచి రికవరీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే పారిశుధ్య నిర్వహణ నిలిపివేస్తామని హెచ్చరించారు. అనంతరం జోనల్‌ కమిషనర్‌ ఎస్‌.వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రవ్వ నరసింగరావు, పారిశుధ్య కార్మికుల సంఘం ప్రతినిధులు సురేష్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.