Jun 22,2023 23:39

నిరసన కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి - నరసరావుపేట : నరసరావుపేట పురపాలక సంఘం పరిధిలో పని చేస్తున్న 323 మంది మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు 3 నెలలుగా నిలిపివేసిన హెల్త్‌ అలవెన్సులు తక్షణమే విడుదల చేయాలని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పెర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. గురువారం స్థానిక పురపాలక శాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. సిఐటియు నాయకులు షేక్‌ సిలార్‌ మసూద్‌ మాట్లాడుతూ హెల్త్‌ అలవెన్సులు రాకపోవడంతో మున్సిపల్‌ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రస్తుతం పిల్లల చదువులు, పుస్తకాల కొనుగోళ్లు, కుటుంబ ఇతర ఖర్చులకు కార్మికులు అవస్థ పడుతున్నారని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న హెల్త్‌ అలవెన్సులు విడుదల చేయడం వలన ఆర్థిక వెసులుబాటు దక్కుతుందన్నారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు, కార్మికులు టి.మల్లయ్య, ఎ.సాల్మన్‌, పి.ఏసు, కె.ప్రసాద్‌, కె.తిరుపతి, మార్తమ్మ పాల్గొన్నారు.