Jul 14,2023 21:48

నిరసన తెలుపుతున్న మున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : హెల్త్‌ అలవెన్స్‌లు చెల్లించకపోతే విధులను బహిష్కరిస్తామని మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులు శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు ప్రజారోగ్య అధికారి సిహెచ్‌ మురళితో మాట్లాడుతూ గత 4 నెలలుగా హెల్త్‌ అలవెన్స్‌ల బకాయి రావాల్సి ఉందని, ఈ విషయంపై పలుమార్లు కమిషనర్‌ జె.రామప్పలనాయుడు దృష్టికి తీసుకెళ్లామని, తమ అకౌంట్‌లో జమ చేస్తామని చెప్తూ మభ్య పెడుతున్నారని అన్నారు. ఈ శనివారం లోపు తమ అకౌంట్‌లో డబ్బులు జమ కాకపోతే విధులను బహిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో కార్మికులు రవి, సింహాచలం, మల్లేశ్‌, నిర్మల, సత్తిరాజు, శివ శంకర్‌రావు, సంతు, రాజేష్‌. తదితరులు పాల్గొన్నారు.