Jul 24,2023 00:38

మాట్లాడుతున్న రమాసుష్మ

ప్రజాశక్తి-గుంటూరు : అంగన్‌వాడీ హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం నివారించాలని కోరుతూ పోరాటానికి సిద్ధం కావాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎన్‌.రమాసుష్మ పిలుపునిచ్చారు. యూనియన్‌ నాయకులు కె.వెంకటరమణ అధ్యక్షతన ఆదివారం పాతగుంటూరు సిఐటియు జిల్లా కార్యలయంలో హెల్పర్స్‌ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. రమాసుష్మ మాట్లాడుతూ అంగన్‌వాడీ ఖాళీ పోస్టుల్లో అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉందని, కానీ జిల్లాలో అనేక చోట్ల ప్రజాప్రతినిధులు అవరోధం కలిగిస్తున్నారని అన్నారు. హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలనే జీవోను అంగన్వాడీలు పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్నారని, ఉత్తర్వులు విడుదలైనా ప్రజా ప్రతినిధుల జోక్యంతో అర్హులకు ప్రమోషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. హెల్పర్ల ప్రమోషన్లు చట్టబద్ధమైన హక్కు అని, ప్రజా ప్రతినిధుల దయాదాక్షిణ్యంపై ఆధారపడి ఇచ్చేవి కావని అన్నారు. కొందరు ప్రజాప్రతినిధులు తమ అనుయాయులకు చట్ట విరుద్ధంగా కట్టబెడుతు న్నారని, ఈ అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ జిల్లా వ్యాప్త ఉద్యమానికి అంగన్వాడి యూనియన్‌ సమాయత్తం అవుతోందని ప్రకటించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.లక్ష్మీనారాయణ మాట్లాడారు.