Feb 18,2023 01:53
హెల్మెట్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ప్రతి ఒక్క ద్విచక్ర వాహన చోదకుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించి ప్రయాణించాలని, జిల్లాలో రోడ్డు ప్రమాదాల వలన గడిచిన రెండు సంవత్సరాలలో మరణించిన వారిలో 43 శాతం మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ హెల్మెట్ల ఆవశ్యకత గురించి జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. హెల్మెట్‌ లేని ప్రయాణం ప్రమాదకరమని, రహదారి భద్రత మన జీవితాలకు రక్షణ అని తెలిపారు. చాలా వరకు రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదం వలన జరుగుతున్నాయని, కేవలం మోటార్‌ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేక పోలీసులు వేసే జరిమానాల నుంచి తప్పించుకోవటం కోసమో హెల్మెట్‌ను ధరించడం కాకుండా మన భద్రత కోసం, డ్రైవింగ్‌ సమయంలో మన కుటుంబాలను గుర్తు చేసుకోవాలని తెలిపారు. బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో డ్రైవింగ్‌ చేయడం వలన రోడ్డు ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చునని అన్నారు. తప్పనిసరిగా ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్‌ ధరించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా ఎస్పి ప్రజలకు సూచించారు. గడిచిన రెండు సంవత్సరాలలో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనాలలో ప్రయాణిస్తున్న వారే 54 శాతం రోడ్డు ప్రమాదాలకు గురయ్యారని, దాదాపు 47 శాతం మంది గాయపడగా, దాదాపు 44 శాతం మంది మరణించారని ఎస్‌పి తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల ఏదైనా అనుకోని రోడ్డు ప్రమాదం సంభవించినప్పుడు తలభాగంలో బలమైన గాయాలు తగలడం వల్ల మరణిస్తున్నారన్నారు. హెల్మెట్‌ ధరించి ప్రయాణం చెయ్యడం వల్ల ఏదైనా అనుకోని రోడ్డు ప్రమాదం జరిగినప్పటికీ తలకు రక్షణగా హెల్మెట్‌ వుంటుందని, కనుక ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా వుంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ కెవి రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారికి హెల్మెట్‌ ధరించడం వలన కలిగే ప్రయోజనాల గురించి, దాని ఆవశ్యకత గురించి వివరిస్తూ హెల్మెట్‌ గురించి విస్తతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల మేదరమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 16వ నెంబరు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ గురించి అవగాహన కల్పించి ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేసి, హెల్మెట్‌ ధరించడం పట్ల జిల్లాలోని ప్రజలకు విస్తృత అవగాహన కల్పించామన్నారు. అదేవిధంగా బాపట్ల జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్‌ల పోలీస్‌ అధికారులు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారన్నారు. ప్రతిరోజూ వివిధ రకాల కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ ధరిస్తే కలిగే ఉపయోగాలు గురించి, ఎటువంటి హెల్మెట్‌లు ధరించాలి అనే పలు విషయాల గురించి ప్రజలకు, యువతకు, విద్యార్థులకు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.