Jun 19,2023 02:30
మాట్లాడుతున్న హనుమంతరావు

ప్రజాశక్తి-బాపట్ల: మానవుల్లో హేతుబద్ధ ఆలోచనను ప్రేరేపించడమే హేతువాద, మనవవాద ప్రధాన లక్ష్యమని భారత హేతువాద సంఘ అధ్యక్షులు కుర్రా హనుమంతరావు అన్నారు. ఆదివారం బాపట్ల ఎన్జీవో హౌంలో జరిగిన హేతువాదం మానవవాద అధ్యయన తరగతుల్లో ఆయన ప్రసంగించారు. మనుషులు సహజంగానే హేతుబద్ధ ఆలోచన చేయగలవారని, అయితే మతాలు విశ్వాసాలను ప్రచారం చేసి వారిలో అభ్యుదయ భావాల ఆలోచనలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. భారత హేతువాద సంఘ కోశాధికారి షేక్‌ బాబు మాట్లాడుతూ మానవజాతి స్వేచ్ఛగా, స్వతంత్రంగా, వివేకంతో జీవించే అవకాశం ఉండాలన్నారు. భారత హేతువాద సంఘ ప్రధాన కార్యదర్శి మేడూరి సత్యనారాయణ మాట్లాడుతూ మానవుల్లో విశ్వ అవగాహన పెరగాలన్నారు. విశ్వాన్ని సృష్టించలేమని, నాశనం చేయలేమని ఆధునిక విజ్ఞానం చెబుతుందన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ప్రొఫెసర్‌ కారుమంచి విజరు కుమార్‌, విశ్రాంత లెక్చరర్‌ గోరంట్ల శాంతారాం, బాపట్ల హేతువాద సంఘ అధ్యక్షులు కరణం రవీంద్రబాబు, రాష్ట్ర హేతువాద సంఘ సహాయ కార్యదర్శి సింహాద్రి యలమందారెడ్డి, కరణం రవీంద్రబాబు పాల్గొన్నారు.