ప్రజాశక్తి- ములగాడ : హెచ్‌పిసిఎల్‌లో 1997 సెప్టెంబరు 14న జరిగిన భారీ విస్పోటనంలో 61మంది, 2013 ఆగస్టు 23న కూలింగ్ టవర్ కూలి మృతిచెందిన 28 మంది కార్మికులకు హెచ్‌పిసిఎల్ లేబరు గేట్ వద్ద హెచ్‌పిసిఎల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన నివాళులర్పించారు. తొలుత అమరుల స్థూపానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పూలమాల వేశారు. సిఐటియు మల్కాపురం జోన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.పెంటారావు ఆర్.లక్ష్మణమూర్తి, జోన్ నాయకులు పి.పైడిరాజు, నరేష్, టి.అప్పారావు శ్రద్దాంజిలి ఘటించారు, అనంతరం జరిగిన సంస్మరణ సభలో జగ్గునాయుడు మాట్లాడుతూ, హెచ్‌పిసిఎల్‌లో రెండు పెద్ద ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో మరణాలు, రూ.కోట్లలో ప్రజల ఆస్తి బూడిదయ్యాయని తెలిపారు. ఈ ప్రమాదాలకు కారణమైన యాజమాన్యంపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదన్నారు. సేప్టీ ఆడిట్ జరపకపోవడం, భద్రత కట్టుదిట్టంగా లేకపోవడంతో కార్మికులు ప్రమాదాలపాలై మృతి చెందుతున్నారని, ఆయా కుటుంబాలు దిక్కులేనివి అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మంచుకురిసినా, మబ్బులేసినా హెచ్‌పిసిఎల్ యాజమాన్యం విష వాయువులను బయటకు వదిలేస్తోందని, దీనివల్ల పిల్లల మొదలు వృద్ధుల వరకు అనారోగ్యాల పాలవుతున్నారని తెలిపారు. విషవాయువులను బయటకు వదలకుండా కట్టడి చేయాలని డిమాండ్‌చేశారు. విస్తరణ పనుల్లో స్థానికులకు ఉపాధి కల్పించకుండా ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తోందని మండిపడ్డారు. 75 శాతం పనులు స్థానికులకే కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినా హెచ్‌పిసిఎల్ యాజమాన్యం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పి.సురేష్, ఎ.రవణ, అర్జునరావు, ఏసుబాబు, నీలయ్య, శంకర్, రామకృష్ణ, కిషోర్, బిఎస్‌ఆర్.మూర్తి, రాము, శ్రీను, సంతోష్, కార్మికులు పాల్గొన్నారు.










