
ప్రజాశక్తి-ములగాడ : హెచ్‌పిసిఎల్‌లో ఘోర విస్పోటనంలో మృతిచెందిన కార్మికులకు సంస్థ లేబరు గేట్ వద్ద హెచ్‌పిసిఎల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన నివాళులర్పించారు. అనంతరం యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.నరేష్ అధ్యక్షతన సభ ఏర్పాటుచేశారు. సభ వద్ద మృతుల స్థూపానికి సిఐటియు మల్కాపురంజోన్ అధ్యక్ష కార్యదర్శులు కె.పెంటారావు, ఆర్.లక్ష్మణమూర్తి, నాయకులు పి.పైడిరాజు పులమాలవేశారు. ఈ సందర్భంగా ఆర్.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, హెచ్‌పిసిఎల్‌లో 1997 సెప్టెంబరు 14న ఘోర విస్పోటనం జరిగి 26 ఏళ్లు అయిందన్నారు. ఈ విస్పోటనంలో 61మంది కార్మికులు మృతిచెందారని, అనేక మంది గాయ పడ్డారని గుర్తుచేశారు. 2013లో కూలింగ్ టవర్ కూలిపోయి 28మంది మృతిచెందారని తెలిపారు. హెచ్‌పిసిఎల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సేప్టీ ప్రమాణాలు పాటించడంలేదన్నారు. కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌చేశారు.
కాంట్రాక్టు కార్మికులకు కనీసవేతనాలు, ఇఎస్‌ఐ, పిఎఫ్, విస్తరణ పనుల్లో స్థానికులకు 75శాతం ఉపాధి కల్పించడంలేదని, మంచినీరు, మరుగుదొడ్ల సదుపాయాలు లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజేష్, రాజు హరి, రాము, ప్రేమ్, మురళీ, విష్ణుదాస్. నీలయ్య తదితరులు పాల్గొన్నారు.