Nov 06,2022 23:24

మాట్లాడుతున్న యుటిఎఫ్‌ నేత మహేశ్వరరావు

యుటిఎఫ్‌ అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరావు.
ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌ :
విద్యార్థులకు బైజూస్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు వారి తల్లిదండ్రుల ఫోన్‌ నెంబర్లు రిజిస్ట్రేషన్‌ చేయలేదన్న కారణంతో ఏజెన్సీలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అల్లూరి జిల్లా విద్యాశాఖాధికారి మెమోలు జారీ చేయడం సరికాదని, తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని యుటిఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి వి మహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం అరకులోయ గిరిజన సంఘం కార్యాలయంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, బైజూస్‌ యాప్‌ ద్వారా విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు వారి తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్స్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేసిప్పటికీ, ఏజెన్సీలోని పరిస్థితులు వల్ల అది ఆశించిన రీతిలో సాగదని అందరికీ తెలిసిన విషయమేనన్నారు. చాలా గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌ లేకపోవడం, ఒకవేళ ఫోన్‌ ఉన్నా అది అండ్రాయిడ్‌ ఫోన్‌ కాకపోవడం ఒక కారణమైతే, గిరిజన ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌, ఇతరత్రా సాంకేతిక, బౌగోళిక సమస్యలు వల్ల హెచఎంలు వారికి నిర్ధేశించిన లక్ష్యం పూర్తి చేయలేకపోయారన్నారు. అంతమాత్రాన దీనికి బాధ్యులను చేస్తూ హెచ్‌ఎంలకు మెమోలు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే హెచ్‌ఎంలకు ఇచ్చిన మెమోలను డిఇఒ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు కార్యక్రమంలో యుటిఎఫ్‌ ఐటిడిఎ సబ్‌ కమిటీ కోకన్వీనర్‌ ఎం.బాబురావు, అనంతగిరి మండల అధ్యక్షుడు పి.దేముడు పాల్గొన్నారు.