ప్రజాశక్తి- సీతమ్మధార :వ్యాపార లావాదేవీలకే పరిమితం కాకుండా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ఆంద్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సీతమ్మదార హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు శాఖ ఆధ్వర్యంలో రక్తదానం డ్రైవ్‌ను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 2007లో 4,387 యూనిట్లుతో మొదలైన బ్లడ్ డొనేషన్ స్పెషల్ డ్రైవ్‌ను నేడు ఐదు లక్షల యూనిట్లకు చేరిందంటే ఆషామాషీ కాదని, ఐదు లక్షల యూనిట్లు రక్తాన్ని సేకరించడమంటే, కనీసం ఐదు లక్షలమంది ప్రాణాలను కాపాడడమేనన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న బ్యాంకు సిబ్బంది అభినందనీయులన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ప్రజాప్రయోజన సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కాయల వెంకటరెడ్డిని దుశ్శాలువాతో సత్కరించారు. బ్యాంక్ సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు.










