May 24,2023 19:20

రోడ్డుపై ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణంలోని హెచ్‌బిఎస్‌ కాలనీ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని టిడిపి ఫ్లోర్‌ లీడర్‌ వి.దయాసాగర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం దయాసాగర్‌ నాయకత్వంలో టిడిపి నాయకులు ఫ్ల కార్డులు ప్రదర్శిస్తూ గుంతలు పడిన రోడ్డుపై నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుంతలు పడి, కంకర తేలిన రోడ్డుపై ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పట్టణంలోని హెచ్‌బిఎస్‌ కాలనీలో రోడ్లు వేయలంటూ, టిడిపికి ఓట్లు వేసినందుకు వార్డు ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. గుంతలమయంగా ఉన్న ఎల్‌ఐసి కార్యాలయం రోడ్డుతో పాటు ఎఆర్‌ స్పోర్ట్స్‌ దుకాణం నుంచి పిరమిడ్‌ ధ్యాన కేంద్రం వరకు రోడ్డు వేయాలని రెండేళ్లుగా కౌన్సిల్‌లో కోరినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రోడ్డుకు కోసుకుపోయి, గుంతలు పడి, కంకర తేలిందన్నారు. ఈ దారిలో పలు బహుళ అంతస్తుల భవనాలు, పలు పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయన్నారు. స్థానికులు, ప్రయాణికుల నుంచి రోడ్డు బాగు చేయాలని డిమాండ్‌ వ్యక్తం అవుతోందని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు. లేకపోతే వార్డు ప్రజలతో కలిసి మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. టిడిపి నాయకులు మల్లికార్జున, మధుబాబు, రామకృష్ణ పాల్గొన్నారు.