Nov 09,2023 00:30

కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : జిల్లా కేంద్రం నుండి 8 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యా యులకు 16 శాతం ఇంటిఅద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఎ) అమలు చేయాలని యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌ కోరారు. ఈ మేరకు యుటిఎఫ్‌ నాయకులు పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన జీవో నంబర్‌ 69 ప్రకారం కొన్ని గ్రామాలకు మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేసి మరికొన్ని గ్రామాల అమలులో ఖజానా అధికారులు అభ్యంతర వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. గతంలో నరసరావుపేట పట్టణానికి 8 కిలోమీటర్ల పరిధిలో ఉండి 12 శాతం హెచ్‌ఆర్‌ఎ పొందుతున్న అందరికీ 16 శాతం అమలు చేయాలన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని ప్రేమ్‌ కుమార్‌ చెప్పారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయ సారథి, జిల్లా సహాధ్యక్షులు ఎం.మోహన్‌రావు, పట్టణ అధ్యక్షులు కోటేశ్వరరావు, నాయకులు సాంబయ్య, సాయి ఉన్నారు.