అర్థరాత్రి వేళ అడ్డుకున్న బుచ్చెంపేట వాసులు
రేయింబవళ్లు తేడా లేకుండా రవాణాపై ఆందోళన
దుమ్ము, ధూళి, భారీ శబ్ధాలతో అవస్థలంటూ ఆవేదన
ప్రజాశక్తి- రోలుగుంట : రేయింబవళ్లు తేడాలేకుండా ఊరి మధ్యలోంచి దుమ్ము, ధూళితో రరును దూసుకుపోతున్న భారీ క్వారీ లారీలతో అవస్థలు పడుతున్నామని మండలంలోని బుచ్చెంపేట గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నోసార్లు అధికారులు, నేతలకు మొరపెట్టుకున్నా ఎటువంటి స్పందన లేకపోవడంతో, శుక్రవారం అర్ధరాత్రి తమ గ్రామంలోంచి వెళుతున్న క్వారీ లారీలను అడ్డుకొని ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి, అపరాత్రితేడాలేకుండా భారీ శబ్ధాలతో లారీలు రాకపోకలు సాగిస్తుండడం వల్ల నిద్రాభంగంతో అవస్థలు పడుతున్నామని ఆందోళన వెలిబుచ్చారు. ఈ లారీలు ప్రయాణించేటపుడు వెలువడే దూళి, దుమ్ముతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామానికి వచ్చే రహదారి సింగిల్ రోడ్డు కావడం, ఇరువైపులా భారీగా తుప్పలు ఉండటంతో, పెద్దశబ్ధంతో, వాహనాలు కనబడనంత దుమ్ముదూళితో ఈ లారీలు వస్తుండడం వల్ల ఇదే మార్గంలో వచ్చిపోయే ప్రయాణికులు, వాహన చోదకులుతప్పించుకోవడం ఇబ్బంది అవుతుందని అంటున్నారు. ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అధిక లోడుతో భారీ లారీల రాకపోకలు వల్ల రోడ్డు మొత్తం గోతులమయమై శిథిలమైపోతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నేతలు స్పందించి, క్వారీ లారీల ఇబ్బందులు నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు. లేకుంటే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.










