Mar 21,2023 01:16
శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌

ప్రజాశక్తి-అద్దంకి: వైసీపీ ఫ్యాక్షన్‌ మూకలు అసెంబ్లీలో పాల్పడిన దుశ్చర్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలోనే బ్లాక్‌ డేగా మిగిలిపోతుందని శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. శాసనసభలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే మా పార్టీ దళిత ప్రజాప్రతినిధిపైనే వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారు. దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై దాడికి పాల్పడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న శాసనసభ్యుడిని ఒక పథకం ప్రకారం దళిత వైసిపి శాసనసభ్యుడితోనే దాడి చేయించడం జగన్‌రెడ్డి దిగజారు డు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ముందు వరుసలో మంత్రులు, వైసిపి శాసనసభ్యులు ఉన్నా వెనుకనున్న వారు వచ్చి దళిత శాసన సభ్యుడైన స్వామిపై దాడి చేయించారని, ఇదంతా ఒక పథకం ప్రకారం జగన్‌రెడ్డి చేయించిన దాడిగానే పరిగణిస్తున్నామని తెలిపారు. శాసనసభలోనే ఎస్సీ ఎమ్మెల్యేలకు రక్షణ లేదంటే రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకు రక్షణ ఉందా అని ప్రశ్నించారు. ఇది సైకో పాలన కాక మరేమిటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. శాసనసభలో జరిగిందంతా సభా పతికి తెలుసని అసెంబ్లీలో ఉన్న కెమేరాల ఇన్‌పుట్‌ను ఎటువంటి కత్తిరింపులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దౌర్జన్యానికి పాల్పడిన ప్రజాప్రతినిధులు ఎవరన్నది ప్రజానీకానికి తెలుస్తుందని, మేము తప్పు చేసివుంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధమని ఎమ్మెల్యే గొట్టిపాటి అన్నారు.
చీరాల: తెలుగుదేశం పార్టీ కొండేపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌ శాసనసభ సాక్షిగా దాడి చేయటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. సోమవారం చీరాల ముక్కోణం పార్క్‌ సెంటర్లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య సూచన మేరకు శాసనసభలో కొండపి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయస్వామిపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్‌ఏ సుధాకర్‌ దాడి చేయడాన్ని ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జీఓ నెంబర్‌ 1పై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికారపార్టీ ఎంఎల్‌ఏలు డోలా బాల వీరాంజనేయస్వామిని దూషిస్తూ దాడికి పాల్పడటం శోచనీయమైన విషయం. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్య క్షులు గజవల్లి శ్రీనివాసరావు, మైనారిటీ అధ్యక్షులు మోహిద్దీన్‌, శ్రీనివాస తేజ, కౌతావరపు జనార్దన్‌, కె సుబ్బలక్ష్మి, శాంతమ్మ, ఆంటోనీ, లాలా అహ్మద్‌, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.