వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడవ తరగతి వరకూ సిబిఎస్‌ఇ విధానం అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను సి.ఎం వై.ఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించడం హడావుడి చర్యగా అనిపిస్తోంది. తర్వాతి తరగతులకు ఒక్కో ఏడాది అమలు చేస్తూ 2024 విద్యా సంవత్సరానికల్లా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులను సిబిఎస్‌ఇ విధానంలోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మన బడి నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఇంత ముఖ్యమైన అంశంపై ముఖ్యమంత్రి హఠాత్తుగా ఇలా నిర్దేశించడం బిజెపి విద్యారంగ కాషాయీకరణ ఎజండాకు తోడ్పడుతుందే తప్ప రాష్ట్ర విద్యా వికాసానికి కాదు. నాడు-నేడు ప్రధానంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు కొన్ని సౌకర్యాలు సమకూర్చడానికి సంబంధించిన కార్యక్రమం. కాని సిబిఎస్‌ఇ కి మార్చడం అనేది దీర్ఘకాలిక ప్రభావం వేసే ఒక విధానపరమైన నిర్ణయం. అంత కీలకమైన విషయంపై నిర్ణయం తీసుకోవడానికి ముందుగా సంబంధితులతో విస్తృత చర్చ జరపడం ప్రజాస్వామ్య పాలనలో చాలా ముఖ్యమైన అంశం. ఇప్పటివరకు రాష్ట్రంలో అమలు చేసిన సిలబస్, కరిక్యులం ఫలితాలేమిటి, వాటి మంచిచెడ్డలు పరిశీలించి లోపాలను అధిగమించడానికి ఎలాంటి పద్ధతులు చేపట్టాలన్నది విస్తృతంగా చర్చించాలి. విద్యావేత్తలను, ఉపాధ్యాయ, అధ్యాపక, విద్యార్థి సంఘాలను ఆ కసరత్తులో తప్పక భాగస్వాములను చేయాలి. అంతేగాక ఇలాంటి విషయాల్లో విశేష అధ్యయనం చేసిన ప్రముఖులతో, అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ లాంటి స్వచ్ఛంద సంస్థలతో సలహా, సంప్రదింపులూ అవసరం.
ముఖ్యమంత్రి ఇలా హఠాత్తుగా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలన్న ఆతృతే కారణమని భావించవలసి వస్తోంది. 'ఒక దేశం- ఒకే భాష- ఒకే పన్ను- ఒకే రేషన్ కార్డు...' వంటి నినాదాలతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక్కో రంగంలో తన మతతత్వ నిరంకుశ ఎజండాను అమలు చేస్తోంది. ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే విధానాలపై కేంద్రాన్ని నిలవేయాల్సిందిపోయి రాష్ట్ర ప్రభుత్వం వాటి అమలుకు పోటీ పడడం తగని పని. వైవిధ్య భరితమైనది, ప్రాంతీయ, భాషాపరమైన ప్రభావాలు కలది కాబట్టే విద్యను రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో చేర్చారు. దేశ వ్యాప్తంగా విద్యారంగంలో మార్పులు తేవాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి, అత్యధిక రాష్ట్రాల సమ్మతితో మాత్రమే అమలు చేయాలి. కాని, మోడీ ప్రభుత్వం కేవలం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం ద్వారానే నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అందులోని అంశాలను అమలు చేయబూనడం నష్టదాయకం.
ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, భౌగోళిక పరిస్థితులు, జీవన సరళి, ఆచార వ్యవహారాలనుబట్టి సిలబస్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వేర్వేరుగా ఉండాలి. అంతేగాక ప్రాథమిక, మాధ్యమిక విద్యా బోధన వారి మాతృభాషల్లోనే జరగాలి. ఇలాంటి నేపథ్యంలో దేశమంతటికీ ఒకే పాఠ్య పుస్తకాన్ని కేంద్ర ప్రభుత్వమే రూపొందిస్తుందనీ, దానినే అన్ని రాష్ట్రాలూ అనువదించుకోవాలని చెప్పే నూతన విద్యా విధాన షరతును అంగీకరించడం తగునా? గణితం, సామాన్య శాస్త్రాలు రాష్ట్ర సిలబస్‌లో ఆధునిక అంశాలున్నాయనీ, ఆ కారణంగా కూడా తెలుగు రాష్ట్రాల పిల్లలు అఖిలభారత పోటీ పరీక్షల్లో ముందుంటున్నారనీ ఒక బలమైన అభిప్రాయం నెలకొంది. మరి గుండుగుత్తగా సిబిఎస్‌ఇ లోకి మారితే నేడుందని భావిస్తున్న ఈ సానుకూల అంశాన్ని మన బిడ్డలు కోల్పోతారు కదా! ఇవి మాత్రమేగాక ఇంకా ఇలాంటి అనేక వైవిధ్య భరితమైన అంశాలను, వాటి ప్రభావాలను గురించి ప్రభుత్వం చర్చించిందనడానికి ఎలాంటి దాఖలాల్లేవు. ప్రభుత్వం తొందరపాటు చర్యలు మాని సంబంధితులందరితో సాకల్యంగా చర్చించి రాష్ట్రానికి అవసరమైన రీతిలో నిర్ణయం తీసుకోవాలి. సర్కారు ఆ దిశగా యోచించకపోతే మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు తగు ఒత్తిడి తీసుకురావాలి.










