Aug 05,2023 21:59

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* నిబంధనలు అతిక్రమిస్తే అపరాధ రుసుము
* రేడియం స్టడ్స్‌ ఏర్పాటు చేయండి
* రోడ్డు ప్రమాదాలను నివారించాలి
* హైవే అధికారులకు కలెక్టర్‌ ఆదేశం
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
జాతీయ రహదారిపై వాహనాలను పార్కింగ్‌ చేయరాదని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ స్పష్టం చేశారు. జిల్లాలో పోలీస్‌, రవాణా, ఆర్‌అండ్‌బి, జాతీయ రహదారి శాఖలు సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని జిల్లా కలెక్టర్‌ శ్రీకేశ్‌ లాఠకర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారి భద్రతపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 172 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉందని, అందువల్ల ప్రమాదాలు ఎక్కువగా జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సిసి కెమెరాలను ఏర్పాటు చేసి నిబంధనలు అతిక్రమించిన వారికి, తప్పుడు మార్గంలో వెళ్లే వాహనదారులకు అపరాధ రుసుము విధించాలని హైవే అధికారులను ఆదేశించారు. అతి వేగం, మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా ప్రమాదాలకు గల ప్రధాన కారణాలన్నారు. హైవేపై స్పీడ్‌ లిమిట్‌ బోర్డులను ఇరువైపులా ఏర్పాటు చేయాలని సూచించారు. అతి వేగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల సంభవించే ప్రమాదాలపై వాహన డ్రైవర్లకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. రేడియం స్టడ్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కువగా ప్రమాదాలు సంభవించే స్థలాలైన చిలకపాలెం, కోష్ట తదితర ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సిసి కెమెరాలు పనిచేసేలా చూడాలని, బారికేడ్లు, సమాచారం బోర్డులు, హైమాట్స్‌ లైట్లు, అతి వేగాన్ని నియంత్రించడం ద్వారా చాలావరకు రహదారి ప్రమాదాలను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు.
జిల్లాలో స్వీయ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు గుర్తించామని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక అన్నారు. హైవేపై ఆగి ఉన్న వాహనాలను తగలడం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా మరిన్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. వీటిని నివారించేందుకు ప్రతి వాహనాన్ని ఆపి డ్రైవర్లకు సూచనలు చేస్తున్నామన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైవేలపై డ్రమ్ములను ఏర్పాటు చేసి, వేగాన్ని నియంత్రిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాలు సంభవించే ప్రదేశాల్లో ఫ్లెక్సీ బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రమాదాల నివారణపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామని తెలిపారు.
ఉప రవాణా కమిషనర్‌ ఎం.శివరాం ప్రసాద్‌ మాట్లాడుతూ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల నాలుగో తేదీ నాటికి 350 రహదారి ప్రమాదాలు సంభవించాయ్నఇ చెప్పారు. ప్రమాదాలకు గల కారణాలను గుర్తించామని, వాటిని సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో ప్రమాదాలను నివారించనున్నట్లు వివరించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ మురళీకృష్ణ, జాతీయ రహదారుల సైట్‌ ఇంజినీర్‌ మహేష్‌, ఎఎస్‌పి టి.పి విఠలేశ్వర్‌, ఎంవిఐపి గంగాధరరావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ జాన్‌ సుధాకర్‌, డ్వామా పీడీ జి.వి చిట్టిరాజు, ఇతర శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.