Apr 10,2023 22:55

ప్రజాశక్తి-నందిగామ: నందిగామ వద్ద విజయవాడ-హైదరాబాదు జాతీయ రహదారి నిర్మాణానికి రైతులు భూములిచ్చి నాలుగేళ్లు అవుతున్నా నష్టపరిహారం అందలేదు. ఆరు వరుసల రహదారి నిర్మాణం నిమిత్తం రైతులు నుండి భూములు తీసుకున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేసి రెండేళ్లు అవుతున్నా పరిహారం అందజేయటంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. రెవెన్యూ కార్యాలయం చుట్టూ బాధితులు తిరుగుతున్నా ఫలితం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నందిగామ పట్టణంలో గత రెండు లైన్ల హైవే బైపాస్‌ రోడ్డు ఉంది. దీన్ని ఏడు కిలోమీటర్ల పొడవునా ఆరు వరుసలు నిర్మించారు. స్థానిక చందాపురం, రామన్నపేట, అనాసాగరం వద్ద హై సర్వీసు కోసం రైతుల నుండి భూములు సేకరించారు. రోడ్డు నిర్మాణం చేశారు. నందిగామ వై జంక్షన్‌ వద్ద 880 మీటర్లు మాత్రమే నిర్మించాల్సి ఉండి. మిగిలిన అన్ని చోట్ల భూసేకరణ పూర్తి చేసి రహదారి వేశారు. శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానం భూములు కూడా ఇందులో ఉన్నాయి. కొంత మందికి గతంలో రిజిస్ట్రేషన్‌ ధర ప్రకారం గజాల్లో, మరి కొందరికి ఎకరాల్లో నష్టపరిహారం లెక్కించారు. పరిహారం అంచనాలో భారీ తేడా రావడంతో రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పది మంది కోర్టును ఆశ్రయించారు. మొత్తం 152 మందికి మాత్రమే నష్టపరిహారం అందుకున్నారు. ఇంకా 107 మందికిపరిహారం అందలేదు. తమ భూములకు సంబంధించి అన్ని రికార్డులు రెవెన్యూ అధికారులకు సమర్పించినా మళ్లీ ఇవ్వాలని పంపుతున్నారని రైతులు వాపోతున్నారు. పదిమందికి సంబంధించి అన్ని రికార్డులు స్వీకరించిన స్థానిక రెవెన్యూ అధికారులు పరిహారం మంజూరుకు ఉన్నతాధికారులకు దస్త్రాలు పంపి సైతం నెలలు గడుస్తుంది. అయినా ఫలితం లేకపోలేదు. కొందరు రైతులు భూములకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేవని అధికారులు పేర్కొంటున్నారు. అన్ని రికార్డులు ఇస్తే ఉన్నతాధికారులకు పంపిస్తామని అంటున్నారు. వెంటనే పరిహారం వచ్చేలా చూడాలని భూముల యజమానులు కోరుతున్నారు.