హైవే బాధిత రైతులకు న్యాయమైన పరిహారమివ్వాలి
- ఎపి రైతు సంఘం డిమాండ్
ప్రజాశక్తి-ఆత్మకూర్
కల్వకుర్తి - నంద్యాల 167 కే ప్రధాన జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న బాధిత రైతులకు న్యాయపరమైన పరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్‌కు అనుగుణంగా పరిహారం చెల్లించాలని కోరుతూ ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలంలోని కరివేన గ్రామ సమీపంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు మా బాష, వీరన్నలతో కలిసి ఆయన మాట్లాడారు. రైతుల అనుమతి లేకుండా పంట పొలాల్లో తొక్కుకుంటూ సర్వే చేసి రైతాంగానికి నష్టం చేశారని 2013 భూ సేకరణ చట్ట ప్రకారం గ్రామసభలు జరిపి రైతుల అనుమతితో ధరలు నిర్ణయించి రైతులకు రావాల్సిన డబ్బులు చెల్లించి అప్పుడు భూములు స్వాధీనం చేసుకోవాలని వారు కోరారు. గ్రామ సభలు జరిపి రైతుల భూములకు భూముల్లో ఉన్న బావులకు బోర్లకు ప్రైవేట్ మార్కెట్ రేటు పైన మూడు రేట్లు అదనంగా చెల్లించి భూములు స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో రైతుల భూముల్లో హైవే రోడ్డు వేయకుండా అడ్డుకుంటామని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఆఫీస్ సూపర్డెంట్ సిరాజ్‌కి మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం నాయకులు టి వెంకటేశ్వర రావు, ఏ. రణధీర్, ఎపి వ్యకాసం జిల్లా సహాయ కార్యదర్శి స్వాములు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు దినేష్, హైవేలో భూములు కోల్పోతున్న రైతులు, తదితరులు రైతులు పాల్గొన్నారు.
ఆత్మకూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న రైతులు, నాయకులు










