ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : హైరిస్క్ గర్భిణు కేసుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు అన్నారు. మండలంలోని పనసబధ్ర, కోరె, ఇందుపురం, మడకవానివలస గ్రామాలను శనివారం సందర్శించారు. గర్భిణుల గృహ సందర్శనలు చేసి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఐరన్, కాల్షియం మాత్రలు వేసుకోవడం, అంగన్వాడీలో పౌష్టికాహారం తీసుకోవడం అంశాలను అడిగి తగు సూచనలు ఇచ్చారు. మాతా శిశు సంరక్షణ కార్డులను పరిశీలించి పూర్తి స్థాయిలో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సంబంధిత వైద్యాధికారులతో చరవాణీ ద్వారా మాట్లాడి వారి పరిధిలో ఉన్న గర్భిణీల ఆరోగ్య తనిఖీ వివరాలు ఎప్పటికప్పుడు విధిగా ఎంసిపి కార్డులో నమోదు చేయించాలని, వాటిని పరిశీలించి వైద్యాధికారులు అందులో సంతకాలు చేయాలని ఆదేశించారు. గర్భిణులను గుర్తించిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసి, అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎటువంటి ప్రమాద సూచికలు (హైరిస్క్)గుర్తించినా వెంటనే నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు.
వేక్సినేషన్ పరిశీలన
కోరె గ్రామం, ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి పిల్లలకు ధనుర్వాతం, కంఠసర్పి నివారణకు వైద్య సిబ్బంది నిర్వహించిన టిడి వ్యాక్సినేషన్ ప్రక్రియను డిఐఒ పరిశీలించారు. వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉండాల్సిన మార్గదర్శకాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. టీకా ఆవశ్యకతను ఉపాధ్యాయులకు, పిల్లలకు వివరించారు. అలాగే పలు గ్రామాల్లో పిల్లల టీకా కార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామాల్లో సీజనల్ వ్యాధులు, జ్వరాలు ఏమైనా సంభవిస్తున్నాయా అని అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ జరుగుతుందని, వారికి వివరిస్తూ, వీటి పర్యవేక్షణ పూర్తి స్థాయిలో చేపట్టి, అవసరమైన మందులు, పరీక్షలు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ జయగౌడ్, వైద్య సిబ్బంది సరోజిని, భారతి, అంగన్వాడీ సిబ్బంది లక్ష్మి , ఆశా కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.










