
ప్రజాశక్తి - కొమరాడ : మండలంలోని కూనేరు రామభద్రపురం, కొమరాడ పిహెచ్‌సిల్లో నిర్వహించిన ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ (పిఎంఎస్‌ఎంఎ) కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డిఐఒ) డాక్టర్ టి.జగన్మోహనరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులకు చేపడుతున్న ఆరోగ్య తనిఖీలను, నమోదు వివరాలను ఆయన పరిశీలించారు. ముఖ్యంగా బిపి, మధుమేహం, హీమోగ్లోబిన్, బరువు, మూత్ర పరీక్షల నివేదికలను పరిశీలించి హెచ్చు, తగ్గులు ఉన్నవారికి తగు చికిత్స అందజేసి సాధారణ స్థితి పొందే వరకు పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. అక్కడ గర్భిణులతో డాక్టర్ జగన్మోహనరావు మాట్లాడి వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షించారు. ప్రతి గర్భిణీకి నిర్దేశించిన కాన్పు తేదీని తెలియ జేయాలని సిబ్బందికి సూచించారు. హైరిస్క్ గర్భిణులకు కాన్పు సమయానికి వారం ముందుగానే నిర్దేశించిన ఆసుపత్రిలో చేర్చాలన్నారు. అలాగే సాధారణ ప్రసవాలు పిహెచ్‌సిలో జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందజేసిన వైద్య పరికరాలను, మందులు, పరీక్షలు విధిగా ఉపయోగించి ప్రసవ సమయానికి గర్భిణులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. పిఎంఎస్‌ఎంఎ, జెఎస్వై, జెఎస్‌ఎస్కె, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అర్హులైన గర్భిణులకు సకాలంలో అందేలా చూడాలన్నారు. టిడి వ్యాక్షినేషన్ రెండు డోసులు నిర్దేశించిన సమయానికి వేయడం జరిగిందా ఎమ్సిపి కార్డులో పరిశీలించారు. కిల్కారీ సేవలు ఏ మేరకు వినియోగిస్తున్నారో ఆరా తీశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ సిహెచ్ అరుణ్‌కుమార్, డాక్టర్ శామ్యూల్, డాక్టర్ ఎం.శిరీష, సూపర్ వైజర్స్ విజయకుమారి, శారద, నిర్మల, జయగౌడ్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఉన్నారు.