Oct 18,2023 23:42

ధర్నాలో మాట్లాడుతున్న ఈమని అప్పారావు

ప్రజాశక్తి - దుగ్గిరాల : హైలెవెల్‌ ఛానల్‌ పనులను పూర్తి చేసి సాగు, తాగునీరు సరఫరా చేయడం ద్వారా రైతులను ఆదుకోవాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు డిమాండ్‌ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ప్రజా చైతన్య పాదయాత్రలో భాగంగా మండలంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేశారు. కార్యక్రమానికి సిపిఎం మండల కార్యదర్శి జె.బాలరాజు అధ్యక్షత వహించారు. అప్పారావు మాట్లాడుతూ దుగ్గిరాల మండలంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రేవేంద్రపాడులో మద్రాస్‌ కాల్వపై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరుతోందని, గ్రామాల్లో డ్రెయినేజీ సమస్య వల్ల ప్రజలు డెంగీ, మలేరియా, ఇతర విషజ్వరాలు బారిన పడుతున్నారని తెలిపారు. ఈమని గ్రామంలో ఇసుక లోడుతో భారీ వాహనాలు యథేచ్ఛగా తిరగడం వల్ల మోకాలిలోతు గుంతలు పడి రోడ్లు ధ్వసంసమయ్యాయని తెలిపారు. వీటివల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు వాటిల్లుతున్నాయని, రహదార్లకు సత్వరమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అనేక గ్రామాల్లో దళితులకు శ్మశాన స్థలాల్లేక అవస్థ పడుతున్నారని తెలిపారు. అప్రకటిత విద్యుత్తు కోతలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. తుమ్మపూడిలో మాస్టిన్‌ సామాజిక తరగతి వారికి కుల ధ్రువీకరణ పత్రాలను తహశీల్దార్‌ మంజూరు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, 40 ఏళ్లుగా ఇళ్లేసుకుని వారుంటున్న స్థలాలకు బీ ఫారాలకు బదులు శాశ్వత పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలో తాగునీటి పైపులైను వేసి ఏడెనిమిద ఏళ్లవుతున్నా నీరు మాత్రం సరఫరా చేయడం లేదని, సత్వరమే సరఫరాకు చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు ఎం.నాగమల్లేశ్వరరావు, ఎన్‌.యోగేశ్వరరావు, వై.బ్రహ్మేశ్వరరావు, కె.కోటయ్య, బి.అమ్మిరెడ్డి, ఏసుపాదం, పాములు, శేషగిరి పాల్గొన్నారు.