Mar 06,2022 06:02

మొత్తంపైన విభజన తర్వాత ఎనిమిదో ఏట కూడా రాజధానిపై అస్పష్టత ఆందోళన కలిగిస్తుంది.నష్టం కూడాచేస్తుంది. ఈ తీర్పుతర్వాతనైనా దాన్ని ముగించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. రాజకీయ వైరుధ్యాలు ఎలా వున్నా ప్రజలందరి ఆశ.వికేంద్రీకరణ తప్పనిసరిగా జరగాల్సిందే గాని అది రాజధాని విభజన రూపంలోనా? అందరూ అంగీకరించిన హైకోర్టు కర్నూలు తరలింపు అభ్యంతరంగా మారడం ఈ కేసు మొత్తానికి అదే కీలకవాదనకావడం గమనించదగ్గది.
అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని యథాతథంగా కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ మినహా అన్ని పార్టీలూ స్వాగతించాయి, దాన్ని శాసనరాజధానిగా పరిమితం చేసి పాలనా రాజధానిని విశాఖపట్టణంలోనూ, న్యాయ రాజధానిని కర్నూలులోనూ ఏర్పాటు చేయాలని 2020జనవరిలో మళ్లీ ఆగష్టులో రెండుసార్లు ఎపిశాసనసభ బిల్లు ఆమోదించడం తీవ్ర ప్రతిష్టంభనకు దారితీసింది.807 రోజులుగా రైతులు దీక్షా శిబిరాలు నడుపుతున్నారు. అ సమయంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్లు గత రెండేళ్లుగా విచారణలో వున్నాయి. ఈ లోగా హైకోర్టులో ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులు మారారు.గత నవంబరులో ఆ బిల్లును వెనక్కు తీసుకుంటూ ప్రభుత్వం రద్దు బిల్లును ఆమోదించింది. అదే సమయంలో పాలనా వికేంద్రీకరణ తమ విధానమనీ, మరింత పటిష్టంగా లోపరహితంగా కొత్త బిల్లు తెస్తామని ప్రకటించింది. గతంలో రెండుసార్లు వాయిదా పడిన ఈ కేసు విచారణను పున:ప్రారంభించిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ప్రశాంతకుమార్‌ మిశ్రా,న్యాయమూర్తులు సోమయాజులు,సత్యనారాయణ మొదటినుంచి మళ్లీ వాదనలు విన్నారు. రాజధాని ఎక్కడ వుండాలో తాము చెప్పబోమని, ముందే ప్రకటించారు. ఏడవతేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్‌ సమావేశాలలో మరోసారి వికేంద్రీకరణ బిల్లు తీసుకువస్తారనే ఊహాగానాల మధ్య హైకోర్టు తీర్పు వెలువరించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ తీర్పుతో తమ విధానం మారబోదని ప్రభుత్వం ప్రకటించగా గత పాలకపార్టీ అయిన తెలుగుదేశం ఇది తమ విజయమన్నట్టు హడావుడి చేస్తున్నది. ఉభయ కమ్యూనిస్టులు ఈ తీర్పును అమలు చేసి రాజధాని వివాదం ముగించాలని కోరాయి.

  • సిఆర్‌డిఎ ఒప్పందాల ఉల్లంఘన

అమరావతిలో రాజధాని నిర్మించడం కోసం శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.అందుకోసం ఎపిసిఆర్‌డిఎను నెలకొల్పింది, అభివృద్ధి చేసిన ప్లాట్లు, వాణిజ్య ప్లాట్లు కేటాయించడం, కౌలు ఇవ్వడం ప్రాతిపదికగా రైతులనుంచి 34 వేల ఎకరాలు సేకరించింది. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తిచేస్తామనీ, పదేళ్లనాటికి ప్రపంచ స్థాయి నాణ్యతతో దాన్ని పెంపొందిస్తామని మాట ఇచ్చింది. ఎపిసిఆర్‌డిఎ 9.14 కింద జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(జిపిఎ)చేసుకుని ఆ భూమిని స్వాధీన పర్చుకుంది. కాని ఇప్పటికీ వారికి ప్లాట్లు అప్పగించడం పూర్తికాలేదు, మౌలిక సదుపాయాలు భవనాల నిర్మాణం జరగలేదనీ హైకోర్టు పేర్కొంది. 2019లో వచ్చిన ప్రభుత్వం మూడు రాజధానుల విధానం తీసుకోవడంతో అమరావతి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.ప్రామిసరీ ఇస్టోపిల్‌ సూత్రం ప్రకారం సిఆర్‌డిఎ ప్రభుత్వం చేసిన వాగ్దానం నిలబెట్టుకోలేదు. ఒక కాంట్రాక్టులో ఉభయపక్షాలు తమ మాటకు కట్టుబడివుండాలి. ప్రభుత్వమే ఆ స్థానంలో వుంటే మరింత బాధ్యతగా వ్యవహరించాలి.తన చేతిలో శాసనాధికారం వుందని ఇష్టానుసారం దుర్వినియోగం చేసి ఒప్పందం కట్టుబాటును ఉల్లంఘించకూడదు.ఈ ఏడేళ్లలో వివిధ రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాల కోసం ఇంచుమించు 15వేల కోట్లు ఖర్చు అయింది.అర్ధంతరంగా వదిలివేయడంతో ఆ ప్రజాధనం వృథా అవడమే గాక భూములిచ్చిన రైతుల జీవనోపాధి దెబ్బతినిపోయింది. ఆస్తిహక్కుకు విఘాతం కలిగింది. సుక్షేత్రాలయిన వారి భూములు పడావు పడ్డాయి. అభివృద్ధి పనులు పూర్తిచేయడం జరగలేదు గనక ఈ ప్రాంతం వెనకబడి పోయింది. ఇది కాంట్రాక్టు చట్టంలోని 202సెక్షన్‌ను మాత్రమే గాక 21వ అధికరణం కింద జీవించే హక్కుతో సహా ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. సిఆర్‌డిఎతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వారు ఈ విషయమై ఎలాటి న్యాయస్థానంలోనూ కేసు వేయకూడదు. మూడు రాజధానుల బిల్లు మేరకు అమరావతిని శాసనరాజధానిగా పరిమితం చేసేట్టయితే వారు భూములు ఇచ్చేప్పుడు ఆశచూపించిన అభివృద్ధి గాని ఆర్థిక లబ్ధిగాని జీవనోపాధి గాని లభించవు. ఇప్పుడు ఆ బిల్లును వెనక్కు తీసుకున్నాము గనక విచారణ అవసరం లేదని ప్రభుత్వం, సిఆర్‌డిఎ న్యాయవాదులు వాదిస్తున్నారు. భవిష్యత్తులో తెచ్చే వికేంద్రీకరణ శాసనం ఎలా వుంటుందో తెలియకుండా వూహాజనితంగా కేసు విచారణ జరపకూడదని అడ్వకేట్‌ జనరల్‌ చెబుతున్నారు. కాని భూము లిచ్చిన రైతులకు ఇప్పటికే జరిగిన నష్టంతో పాటు భవిష్యత్తు లోనూ దెబ్బతగిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది గనక మేము జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.ఎపిసిఆర్‌డిఎ చట్టం,9.14జిపిఎ ప్రకారం అమరావతిలో గతంలో అనుకున్న విధంగానే రాజధానిని నిర్మించాలని, ఏ కార్యాలయాన్ని ఏ విభాగాన్ని ఎక్కడికి తరలించరాదని ధర్మాసనం తీర్పులో పేర్కొంది.

  • నెలల్లో గడువు,నిరంతర సమీక్ష

రాజధాని నిర్మాణంపై రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి కారణాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రామిసరీ ఇస్టోపిల్‌ కింద ఒప్పందాన్ని తోసిపుచ్చడం ప్రజాప్రయోజనం కింద మాత్రమే అనుమతించవచ్చు.ఇక్కడ అలాటి ప్రయోజనం వుందని నిరూపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వికేంద్రీకరణతో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరుతో ఇక్కడ భూములిచ్చినవారిని వెనకబాటులోకి నెట్టడం సమంజసం కాజాలదు.పైగా హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించేది సుప్రీం కోర్టు కాగా ఆదేశాలిచ్చేది రాష్ట్రపతి. శాసనసభ దీనిపై నిర్ణయం తీసుకోవడానికి లేదు.అమరావతిలో శానసరాజధానిని కొనసాగించినా దానివల్ల వాగ్దానం చేసిన ప్రకారం అభివృద్ధి వుండదు. 163 అధికరణం కింద గవర్నర్‌ శాసనసభను ఎక్కడైనా సమావేశపర్చవచ్చు.అదే జరిగితే శాసనరాజధాని భావనకే అర్థం వుండదు. సమగ్ర రాజధానిగా పెంపొందిస్తామనీ నవనగరాలతో అవకాశాలు మెరుగవుతాయని ఆశపెట్టి భూములు తీసుకున్న తర్వాత ఇన్నేళ్లకు కూడా ఎలాటి పురోగతి లేకపోవడాన్ని న్యాయస్థానం ప్రత్యేకంగా ప్రస్తావించింది. నెలలో మౌలిక సదుపాయాల కల్పన, మూడు మాసాలలో ప్లాట్లు అప్పగింత, ఆరుమాసాలలో మాష్టర్‌ప్లాన్‌ ప్రకారంనిర్మాణం పూర్తి చేయాలని నిర్దేశించింది.నిధులు లేవన్న వాదనను కూడా తోసిపుచ్చుతూ 38వ అధికరణం కింద ప్రభుత్వం అనేక పథకాలకు డబ్బు వెచ్చిస్తున్న సంగతి పేర్కొంది. ఇంత వేగంగా పూర్తి చేయడం ఆచరణ సాధ్యమా అన్న ప్రశ్నలు ముందుకు రావడానికి ఇది దారి తీసింది. పైగా కంటిన్యుస్‌ మాండమస్‌(నిరంతర పర్యవేక్షణ) కింద రాబోయే కాలంలోనూ రాజధాని పనుల పురోగమనాన్ని తాను సమీక్షిస్తుంటాననీ, ఎప్పటికప్పుడు ప్రభుత్వం అఫిడవిట్లు సమర్పించాలని కోర్టు పేర్కొంది. తీర్పులోని ఈ భాగం చాలా అరుదైనదిగాచెబుతున్నారు. ఇందుకోసం నలభై పిటిషన్ల విచారణ కోర్టు అట్టిపెట్టుకుంది. ఇందువల్లనే సుప్రీం కోర్టు జోక్యం చేసుకోకపోవచ్చని ఒక అభిప్రాయం.

  • అధికారానికి పరిమితులు

ఈ సందర్భంగా కోర్టు రెండు ముఖ్యమైన భావనలు పొందుపర్చింది. లెజిస్లేటివ్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌, లెజిస్లేటివ్‌ కాంపిటెన్సీ.(శాసనపరమైన అంచనాలు, శాసనాధికారం) ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్న సమయంలో భూములు ఇచ్చిన వారు గాని ఇతరత్రా గాని రాబోయే శాసనాలపై కొన్ని అంచనాలు పెట్టుకుంటారు. అసాధ్యమైన పరిస్థితులు వుంటే తప్ప వాటిని నెరవేర్చవలసిన బాధ్యత చట్టసభలపై వుంటుంది. వాటికి నష్టం కలిగించే విధంగా చేయడం రాజ్యాంగ నైతికత కాదు.ఇక్కడ సిఆర్‌డిఎ ఇచ్చిన హామీలకు భిన్నంగా విధానాన్ని మార్చడం కోసం చేసే వాదనలు దురుద్దేశపూరితంగా వున్నాయని అనాల్సి వస్తుంది.
రాజధాని విషయంలో రాష్ట్రానిదే అధికారం అని కేంద్రం కోర్టుకు చెప్పింది.అయితే రాజ్యాంగం 2,3,4 అధికరణాల ప్రకారం రాష్ట్రాల ఏర్పాటు విభజన,రద్దు వంటివి జరిగినప్పుడు పార్లమెంటునుంచి మాత్రమే శాసనసభకు అధికారం సంక్రమిస్తుందని కోర్టు వివరణ ఇచ్చింది. ఎపి విభజన చట్టం ప్రకారం ఒకసారి ఆ అధికారాన్ని ఉపయోగించి ఏకగ్రీవంగా రాజధానిని నిర్ణయించారు. దాంతో ఆ అధికారాన్ని వినియోగించడం పూర్తయిందని ధర్మాసనం అభిప్రాయపడింది.దాన్ని తరలించడానికి గాని,లేక మూడు విభాగాలను మూడు చోట్లకు తరలించడానికి గాని శాసనసభకు అధికారం వుండదని తేల్చిచెప్పింది. ఇది కొంత విపరీతంగా కనిపించినా ప్రస్తుత వివాద నేపథ్యంలో రాజధాని మార్పులు ఎడతెగని వ్యవహారంగా వుండరాదన్న స్పూర్తి కనిపిస్తుంది.అంటే రాజధాని నిర్ణయం, మూడుగా విభజన, మళ్లీ దాన్ని రద్దుచేయడం,ఇప్పుడు మరో రూపంలో తేవడం అంటే నాలుగుసార్లు మార్పులు చేయడం నిస్సందేహంగా అసాధారణమే. రేపు మరో ప్రభుత్వం మరోసారి మార్పులు చేస్తూనే వుండొచ్చా? ఈ విషయంలో శాసనాధికారానికి లిమిటేషన్‌(పరిమితి) వుంటుందని కోర్టు అభిప్రాయపడింది.ఉన్న ఫళాన(సూమోటో)గా రాజధాని మార్చేఅధికారం వుండదని హైకోర్టు తేల్చింది.ఇది శాసనసభ అధికారాన్ని కుదించడమే గనక సుప్రీంకోర్టులో సవాలు చేయొచ్చని చెబుతున్నారు. రాజధానిపై గతంలో మూడుసార్లు సుప్రీంకోర్టులో రాష్ట్ర వాదనలు వీగిపోయాయి..ఇప్పుడు వెళ్లినా ప్రయోజనం వుండదనే భావన ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది.కొద్ది మాసాలు నిరీక్షించడమా లేక మరో కోణంలో వెళ్లడమా తర్జనభర్జన పడుతున్నది. పైగా ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులను నాట్‌ బిఫోర్‌ చేయాలని ఒక అధికారి కోరిన దాన్ని తీర్పులో వ్యంగ్యంతో ముందే తోసిపుచ్చారు. ఏదో రూపంలో ఈ ఘర్షణ ఇంకా సాగుతూనేవుందని గమనంలో వుంచుకోవాలి.

  • మూడు ప్రభుత్వాల తప్పిదాలు

గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులను లెక్కలను కోర్టు తీర్పులో వివిధ చోట్ల పొందుపర్చారు. నిధుల కొరత వాదనతోనూ ఏకీభవించలేదు, అయితే నిధుల కొరత నిజమే. ఈ దుస్థితికి గత ప్రస్తుత ప్రభుత్వాలు కేంద్రం కూడా బాధ్యత వహించాల్సి వుంటుంది. ఉదాహరణకు తెలుగుదేశం ఇది తన విజయమేనన్నట్టు చెబుతుంది గాని మొదటి జాప్యం అక్కడే జరిగింది.అలాగే దాంతో కలిసి రాష్ట్రాన్ని పాలించిన, ఇప్పటికీ కేంద్రాన్ని పాలిస్తున్న బిజెపి ఈ తీర్పును స్వాగతించింది .అయితే అంతకుముందు రోజే బడ్జెట్‌లో లక్ష రూపాయలు రాజధాని నిర్మాణాలకు కేటాయించినట్టు వార్త వచ్చింది.లక్షకోట్ల పాట ముందు లక్ష ఇవ్వడం నవ్వులాటే. హైకోర్టు తీర్పులో అవి సూచన ప్రాయంగా కూడా లేవు.మొత్తంపైన విభజన తర్వాత ఎనిమిదో ఏట కూడా రాజధానిపై అస్పష్టత ఆందోళన కలిగిస్తుంది.నష్టం కూడాచేస్తుంది. ఈ తీర్పుతర్వాతనైనా దాన్ని ముగించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. రాజకీయ వైరుధ్యాలు ఎలా వున్నా ప్రజలందరి ఆశ.వికేంద్రీకరణ తప్పనిసరిగా జరగాల్సిందే గాని అది రాజధాని విభజన రూపంలోనా?అందరూ అంగీకరించిన హైకోర్టు కర్నూలు తరలింపు అభ్యంతరంగా మారడం ఈ కేసు మొత్తానికి అదే కీలక వాదన కావడం గమనార్హం.
కిం కర్తవ్యం? జగన్‌వ్యూహం!
ఈ సుదీర్ఘమైన తీర్పులో సాంకేతికంగా చెప్పుకోవాల్సిన అంశాలు చాలా వున్నాయి.కాని ఇప్పుడు ఈ తీర్పు అనంతరం ప్రభుత్వ వైఖరి ఎలా వుండబోతున్నదీ ఇప్పటికే దాదాపు వెల్లడైపోయింది.తీర్పు వెనువెంటనే మాట్టాడిన మంత్రులు బొత్స సత్యనారాయణ వంటివారు తమ విధానంలో మార్పు లేదనీ, కోర్టుతీర్పు అధ్యయనం తర్వాత ఎలా ముందుకువెళ్లేది చూస్తామని అన్నారు. రియల్‌ మాఫియా, సామాజిక వర్గం వాదనలు మళ్లీ వినిపించారు.మరుసటిరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడివున్నామంటూ అమరావతిలో నిధులు మొత్తం వెచ్చించలేమన్నట్టు మాట్లాడారు.కొన్ని లెక్కలు అనేక వాదనలు చేశారు.విశాఖలో ముఖ్యమంత్రి మకాం కార్యక్రమాలు పెంచడం,కర్నూలులో జగన్నాథగట్టుపై న్యాయసముదాయం (హైకోర్టు రహితంగా),ప్రత్నామ్నాయంగా చూపించడం తదుపరి చర్యలుగా కనిపిస్తున్నాయి. అమరావతికి సంబంధించి గతంపై ఆరోపణలు చేయడం తప్ప అసంపూర్ణంగా వున్నవాటినైనా పూర్తిచేయడంలో, పూర్తయినవాటిని కేటాయించడంలో ఈ ప్రభుత్వం ఎలాటి నమూనా చూపించలేకపోయింది. అమరావతికీ ఇతర ప్రాంతాలకు మధ్య పోటీ అనేది రాబోయే రోజులలో జగన్‌ ప్రభుత్వరాజకీయ వ్యూహంగా ప్రచారాస్త్రంగా వుండబోతున్నట్టు కనిపిస్తుంది. తెలుగుదేశం కూడా ఇది నిజంగా వికేంద్రీకరణ కంటే వివాదాలు కొనసాగడానికి, దారితీస్తే ఆశ్చర్యం లేదు. ఇందులో కుల వాదనలు కూడా చొరబడటం ఇంకా అవాంఛనీయం. ఇప్పటికే విభజనతో దెబ్బతిని రాజధాని రహితంగాఎపిని మరోసారి అయోమయావస్థలోకి నెట్టడం ఏ విధంగానూ అనుమతించ రానిది. వాదన ఏదైనా అది ఎవరికీ మేలు చేయదు.

హైకోర్టు తీర్పు... కానరాని మార్పు
- తెలకపల్లి రవి