ప్రజాశక్తి - బాపట్ల రూరల్
ఆరోగ్యవంతమైన బాల్యం ద్వారా మంచి చదువుల్ని, మంచి భవిష్యత్తుని పొందవచ్చునని ఏఎంసీ బిళ్ళ మోజెస్ అన్నారు. డెటాల్ బనేగా స్వస్థ ఇండియా, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించిన హైజిన్ ఒలంపియాడ్ ఎగ్జామ్ పేపర్లను మండలంలోని వెదుళ్ళపల్లి జెడ్‌పి హై స్కూల్లో మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా ఐదు మండలాలలో ఎంపిక చేయబడిన 99 పాఠశాలలో హైజిన్ ఎడ్యుకేషన్ అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్ధుల్లో అవగాహన కల్పించేందుకు ఒలంపియాడ్ ఎగ్జామ్ ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 4950మందికి ఈ పరీక్ష రాసినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఐదు విభాగాలలో నిర్వహిస్తున్న ఈ పరీక్ష విజేతలకు రూ.50వేలు, రూ.30వేలు, రూ.20వేలు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు అందజేస్తారని తెలిపారు. నిర్వహిస్తున్న డిబిఎస్ఐ బృందానికి అభినందనలు తెలిపారు. ఎంఇఒ ఎస్ నిరంజన్ మాట్లాడుతూ మంచి అలవాట్ల ద్వారా చిన్నారులు ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని అన్నారు. ఆరోగ్యంగా ఉంటే చదువుల్లో రాణించగలరని తెలిపారు. శారీరక, మానసిక దృఢత్వం చదువులపైన ఎంతగానో ప్రభావాన్ని చూపుతోందని అన్నారు. చేతులు పరిశుబ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం విజయ్ కుమార్, డిబిఎస్ఐ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ కుమారి, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ విబి దాస్, సీఆర్పీలు పాల్గొన్నారు.










