Dec 17,2022 23:41

చింతపల్లిలో పెద్ద ఎత్తున బైఠాయించిన బాధిత గ్రామాల గిరిజనులు

ప్రజాశక్తి - పాడేరు
షెడ్యూల్డ్‌ ఏరియాలో నిబంధనలను ఉల్లంఘించి చింతపల్లి మండలం ఎర్రవరం వద్ద హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రయివేటు సంస్థకు ప్రభుత్వాలు అప్పగించడాన్ని నిరసిస్తూ చింతపల్లి మన్యంలో ఎపి గిరిజన సంఘం ఆధ్వర్యాన తలపెట్టిన బంద్‌ విజయవంతమైంది. అఖిలపక్ష పార్టీలు, పలు ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతూ పోరాటంలో పాల్గొన్నాయి. ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ప్రభావిత మండలాలైన చింతపల్లి, కొయ్యూరు, జికె.వీధి మండలాల్లో ఎక్కడికక్కడ నిరసనలు ఎగసిపడ్డాయి. వేలాది మంది గిరిజనులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. బంద్‌తో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఆటో డ్రైవర్లు ఆటోలను ఎక్కడికక్కడ నిలిపివేసి బంద్‌కు సహకరించారు. ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో చేసిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పెద్ద పెట్టున గిరిజనులు నినదించారు.
ఉదయం నాలుగు గంటలకే ఆంధ్ర కాశ్మీర్‌గా పేరు పొందిన చింతపల్లి మండలం లంబసింగి పర్యాటక ప్రాంతం ముఖద్వారానికి పెద్ద ఎత్తున గిరిజనులు చేరుకొని రాకపోకలను అడ్డుకున్నారు. అనంతరం అక్కడ నుంచి మండల కేంద్రానికి వచ్చి స్థానిక హనుమాన్‌ జంక్షన్‌లో అఖిలపక్ష రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలతో కలిసి మెయిన్‌ రోడ్డులో భైఠాయించారు. పాత బస్టాండ్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స మాట్లాడుతూ ఎర్రవరం హైడ్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన అటవీ పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలన్నారు. ఐదో షెడ్యూల్‌ ఏరియాలో గ్రామ సభ తీర్మానం లేకుండా హైడ్రో ప్రాజెక్టును శిరిడీ సాయి కంపెనీకి అప్పజెప్పడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజన ప్రాంతాలను విచ్ఛిన్నం చేయడం తగదన్నారు. ఎర్రవరం గ్రామస్తులకు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాయమాటలు చెబుతున్నారన్నారు. ఆమె ఓ కార్పొరేట్‌ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ మాధవి తీరు కూడా అలానే ఉందన్నారు.
మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ తక్షణమే హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు. గిరిజన హక్కులను కాలరాస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదన్నారు. సిపిఎం అనంతగిరి జెడ్‌పిటిసి దీసరి గంగరాజు మాట్లాడుతూ రాబోయే జిల్లా పరిషత్‌, ఐటిడిఎ పాలకవర్గ సమావేశాల్లో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై చర్చకు పట్టుబడతానని తెలిపారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానన్నారు. కాంగ్రెస్‌ పాడేరు ఇన్‌ఛార్జి వంతల సుబ్బారావు, ఎపి గిరిజన సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోనంగి చిన్నయ్యపడాల్‌, నాయకులు పాంగి ధనుంజరు, సాగిన చిరంజీవి, టిడిపి నాయకులు సల్లంగి జ్ఞానేశ్వరి, లక్ష్మయ్య, కాంగ్రెస్‌ నాయకులు సూరిబాబు, కృష్ణ పడాల్‌, లకె రమణ, కంకిపటి వీరన్నపడాల్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జీవన్‌ కృష్ణ కార్తీక్‌, హైడ్రో పవర్‌ ప్రాజెక్టు బాధిత గ్రామాల గిరిజన నాయకులు ఉల్లి సత్యనారాయణ, బెన్న స్వామి, సోమరాజు, గూడెపు రాజు, భారీ సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.
కొయ్యూరు : ఎర్రవరం వద్ద హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల పిలుపు మేరకు శనివారం చేపట్టిన బంద్‌ మండలంలో విజయవంతమైంది. బంద్‌ను పురస్కరించుకొని గిరిజన సంఘం, ఆదివాసీ జెఎసితో పాటు సిపిఎం, సిపిఐ, టిడిపి, జనసేన పార్టీల ఆధ్వర్యాన ప్రదర్శన నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ చింతపల్లి, కొయ్యూరు మండలాల పరిధిలో హైడ్రో ప్రాజెక్టు నిర్మాణానికి షిరిడీ సాయి ప్రైవేటు కంపెనీకి అనుమతులు ఇవ్వడం దారుణమన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 32 గ్రామాలకు చెందిన ఆరు వేల మంది గిరిజనులకు తీవ్ర నష్టం వాటిళ్లనుందని పేర్కొన్నారు. రైవాడ దగ్గర పెదకోట పరిధిలో మరో హైడ్రో ప్రాజెక్టును అదానీకి చెందిన గ్రీన్‌ ఎనర్జీ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టిందని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి తలొగ్గి రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలకు విచ్చల విడిగా అనుమతులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. గిరిజనులపై ప్రేమ వలకబోసే వైసిపి వారి మనుగడను ప్రశ్నార్థకం చేసే ఇటువంటి ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడం గిరిజనులను మోసగించడమే అవుతుందన్నారు. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ప్రభుత్వం కూడా ప్రైవేటు కిందకే వస్తుందని సమతా తీర్పులో సుప్రీం కోర్టు వెల్లడించిందని గుర్తు చేశారు. 1/70, పీసా చట్టాల ప్రకారం గ్రామసభల ఆమోదం లేకుండా ఏజెన్సీలో ఏ ప్రాజెక్టు చేపట్టకూడదని, అలాంటిది ఏకపక్షంగా కేబినెట్‌ అదానీ, షిరిడీ సాయి ప్రైవేటు కంపెనీలకు ఎలా అనుమతులు ఇచ్చిందని ప్రశ్నించారు. తక్షణమే అనుమతులు రద్దు చేయాలని, లేకుంటే అల్లూరి సీతారామరాజు బాటలో గిరిజనులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎస్‌.సూరిబాబు, మాజీ ఎంపిపి గోలిసింగి సత్యనారాయణ, కొయ్యురు సర్పంచ్‌ ఎం.బాలరాజు, టీడీపీ నాయకులు దొరబాబు, జనసేన నాయకులు లక్ష్మణరావు, బుజ్జిబాబు, సిపిఐ నాయకులు నాగరాజు, నూకరాజు, సిపిఎం నాయకులు వై.అప్పలనాయుడు, జేఏసీ నాయకులు మాకాడ బూర్గులయ్య, సీఐటీయూ నాయకులు కె.రామ్మూర్తి, గిరిజన సంఘం నాయకులు ప్రభాకర్‌, కొండలరావు, ప్రజలు పాల్గొన్నారు.