Feb 04,2023 23:56

మాట్లాడుతున్న మాజీ ఎంపి మధు

ప్రజాశక్తి - అనంతగిరి :గిరిజన చట్టాలను ఉల్లంఘించి తమ మనుగడను ప్రశ్నార్థకం చేసే హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను ఏజెన్సీలో పెడితే సంప్రదాయ ఆయుధాలతో తరిమి తరిమి కొడతామని పలువురు నేతలు, ఆదివాసీలు హెచ్చరించారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధి రేగులపాలెం గ్రామంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ శనివారం ఏర్పాటు చేసిన సభ విజయవంతమైంది. భారీగా గిరిజనులు తరలివచ్చారు. తొలుత ర్యాలీ నిర్వహించారు. ఈ బహిరంగ సభలో సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీకి చట్ట విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయంతో కట్టబెట్టిన హైడ్రో పవర్‌ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా రేగులపాలెం గ్రామంలో నిర్మించే హయ్యర్‌, లోయర్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు రద్దు కోసం రాష్ట్ర గవర్నర్‌, సిఎంలను కలిసి లిఖితపూర్వకంగా విన్నవిస్తానన్నారు. తక్షణమే హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స మాట్లాడుతూ బాక్సైట్‌ పోరాటం మాదిరిగానే హైడ్రో ప్రాజెక్టు వ్యతిరేక పోరాటమూ ఉధృతమవుతోందన్నారు. అభివృద్ధి పేరిట అధికారులను రంగంలో దించి దొడ్డిదారిన సర్వేలు నిర్వహించి ప్రాజెక్టు పనులు చేపడితే సంప్రదాయ ఆయుధాలతో కంపెనీలను తరిమికొడతామన్నారు. ఇప్పటికే హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణ ప్రాంతాలైన ఎర్రవరం, చిట్టంపాడు. రేగులపాలెం గ్రామాల్లో పోరాటాలకు పదును పెట్టామన్నారు. సిపిఎం జెడ్‌పిటిసి దీసరి గంగరాజు మాట్లాడుతూ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసి, ఆమోదానికి జిల్లా పరిషత్‌, ఐటిడిఎ సమావేశాల్లో గళం విప్పుతానన్నారు. గిరిజన చట్టాలను తుంగలోకి తొక్కితే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు డి.వెంకన్న, సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.నాగులు, టోకూరు సిపిఎం సర్పంచ్‌ మొస్య, పెదకోట మాజీ సర్పంచ్‌ జంపరంగి దేముడు, నాయకులు జె.ఈశ్వరరావు, సింహాచలం, జి.ఆనంద్‌, ఎస్‌.దేముడు, రేగులపాలెం, కుడియా, తమటు, పెదకోట, పిన్నకోట, కొండిబ కోట తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
ప్రమాదంలో గిరిజనుల జీవన మనుగడ
పాడేరు : రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల గిరిజనుల జీవన మనుగడ ప్రమాదంలో పడిందని మాజీ ఎంపీ పి.మధు అన్నారు. స్థానిక అటవీ శాఖ అతిథి గృహంలో శనివారం ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు జరగకపోవడంతో రాష్ట్రం వెనుకబడిపోయిందన్నారు. వైసిపి పాలన అధ్వానంగా ఉందన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌ అసిస్టెంట్ల తొలగింపుతో విద్యార్థులు సెరిబ్రల్‌ మలేరియా వంటి అనారోగ్య పరిస్థితుల్లో వైద్యమందక మరణిస్తున్నారని అన్నారు. జీవో నెంబర్‌ 3 రద్దు వల్ల గిరిజనులకు ఉద్యోగావకాశాలు దూరమయ్యాయని అన్నారు. ఇటీవల ఇరిగేషన్‌ శాఖలో 450 పోస్టులు రిక్రూట్‌ చేస్తే గిరిజనులకు కేవలం నాలుగు ఉద్యోగాలే వచ్చాయని తెలిపారు. 1/70 రెగ్యులేషన్‌పై ప్రభుత్వం ఇంప్లిట్‌ కావాలని డిమాండ్‌ చేశారు. అల్లూరి జిల్లాలో నాలుగు హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను ప్రకటించారని, వీటివల్ల 97 గ్రామాలు, 15 వేల మంది గిరిజన జనాభా, 20 వేల ఎకరాల సాగు భూములు ప్రమాదంలో పడతాయని తెలిపారు. గిరిజనులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న హైడ్రో ప్రాజెక్టుల ప్రతిపాదనను ప్రభుత్వం విరమించాలని డిమాండ్‌ చేశారు. రైల్వే జోన్‌కు అవసరమైన నిధులు బడ్జెట్‌లో మన రాష్ట్రానికి రాలేదని అన్నారు. విశాఖలో గంగవరం పోర్టును జగన్మోహన్‌ రెడ్డి కారు చౌకగా అదానీకి కట్టబెట్టారని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన వల్ల ప్రమాదంలో పడిందని తెలిపారు. సమావేశంలో సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, మండల కార్యదర్శి ఎల్‌.సుందరరావు పాల్గొన్నారు