Jan 05,2023 23:34

చిట్టివలస గ్రామసభలో తీర్మానం ప్రవేశపెడుతున్న సిపిఎం సర్పంచ్‌ మొస్య

సిపిఎం సర్పంచ్‌ కిల్లో మొస్య
చిట్టివలస గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం
ప్రజాశక్తి -అనంతగిరి
: 1/70, పీసా వంటి చట్టాలను తుంగలో తొక్కి, పర్యావరణానికి, గిరిజనానికి నష్టం కలిగించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయంతో చేపట్టబోయే చిట్టవలస వద్ద హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వబోమని సిపిఎం సర్పంచ్‌ కిల్లో. మొస్య స్పష్టం చేశారు. గురవారం టోకూరు పంచాయతీ, శశి వలయ కేంద్రంలో సర్పంచ్‌ కిల్లో మొస్య అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో చిట్టంవలస హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.
ఈ సందర్భంగా మొస్య మాట్లాడుతూ, హైడ్రో వపర్‌ ప్రాజెక్టు వల్ల మన్యానికి, గిరిజనానికి వాటిల్లే నష్టాలను వివరించారు. పంచాయతీ సభ్యులు, ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవం తీర్మానం చేసినట్లు వెల్లడించారు పెద్దకోట, పిన్నకోట పంచాయతీల పరిధిలోని రేగులపాలెం, కుడియా, కొండేపకోట, గుజిరి, అలాగే గుమ్మకోట పంచాయతీ పరిధి గుజ్జిలలోనూ హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా పంచాయతీ గ్రామసభల్లో ఆమోదించి, తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు.
గిరిజనుల జనావాసాలు, పంటపొలాలతోపాటు అడవులు, తాగునీటి వనరులకు నష్టం కలిగించే హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గ్రామాలను సందర్శించి, గిరిజనానికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. దీనిపై చైతన్యవంతులైన పెద్దకోట, రేగులపాలం ప్రజలు తమ గ్రామాల్లో ప్రాజెక్టు భూముల సర్వేకు వచ్చిన అధికారుల బృందాన్ని అడ్డుకుని తిప్పిపంపడమే కాకుండా, మళ్లీ వస్తే తరిమికొడతామని హెచ్చరించారన్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన గ్రామాలు, పంచాయతీల్లోనూ హైడ్రోవపర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మండల, జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాల్లో దీనిపై చర్చ జరిగి, హైడ్రోవపర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసి, ఆమోదించేలా ఒత్తిడి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ జి.నరసన్న పంచాయతీ సెక్రటరీ లావణ్య, విఆర్‌ఒ రామన్న సిపిఎం మండల నాయకులు జి. దేవన్న, వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు