Dec 13,2022 23:48

మాట్లాడుతున్న అప్పలనర్స

ప్రజాశక్తి-పాడేరు: ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదేశాలతోనే కార్పొరేట్‌ మాఫియా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని, దీనిని వ్యతిరేకించాలని గిరిజన ఉద్యోగ మేధావులకు గిరిజన సంఘం పిలుపు నిచ్చింది. దీనిపై మంగళవారం పాడేరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో లో గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనర్స మాట్లాడుతూ, విశాఖలో పర్యటించిన ప్రధాని మోడీ ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టును తన మిత్రులైన అదానీ, శ్రీ సాయి ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌కు అప్పగించాలనే ఒత్తిడి కారణంగా వైసిపి ప్రభుత్వం తన రాజకీయ లబ్ది కోసం కోసం మంగళవారం జరిగిన క్యాబినెట్లో ఆమోదించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజ నేతరులకు అటవీ భూమి కేటాయించిందన్నారు. 5వ షెడ్యూల్డ్‌ నిబంధనలకు వ్యతిరేకంగా హైడ్రో పవర్‌ ప్రాజెక్టు కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించదాన్ని గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. గతంలో అనంతగిరి కొండల్లో టాటా బిర్లా కంపెనీకి బాక్సైట్‌ తవ్వకాలకు లీక్‌ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. జర్రెల బ్లాక్లో బాక్సైట్‌ తవ్వకాలపై రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా గిరిజన సహజ సంపదను, అటవీ వనరులను అప్పగించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొందని తెలిపారు. గిరిజన గ్రామ సభ నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా కార్పొరేట్‌ సంస్థలకు హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ అప్పగించడం సరైంది కాదన్నారు. పీసా చట్టం అటవీ హక్కుల చట్టం, 1/70 చట్టం గిరిజన ప్రాంతాల్లో అమలులో ఉన్నా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించడం తగదని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండించాలని గిరిజన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.గిరిజన గ్రామ సభ అభిప్రాయం లేకుండా దొంగ చాటున రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా గ్రామంలో సర్వే నిర్వహించిందని, గత ఏడాది డిసెంబర్‌ 23న అటవీ, పర్యావరణ అనుమతులను మోడీ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తే 32గ్రామాల ప్రజలు నిర్వాసితులు అవుతారన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి హక్కు పత్రాలు ఇవ్వడానికి సవాలక్ష ఆంక్షలు విధించే ప్రభుత్వం సమారు 1000 ఎకరాల అటవీ భూమిని ప్రైవేట్‌ సంస్థలకు ఎలా ఇస్తారని ప్రశ్నంచారు. కేంద్ర అటవీ సంరక్షణ చట్టాన్ని సవరణకు పూనుకున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతిచ్చి అటవీ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు కుట్ర చేస్తుందని విమర్శించారు.ఇందుకే పార్లమెంట్లో బిజెపికి వైసిపి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన మద్దతు ఇస్తుందని. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు.ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక గిరిజనులకు 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ కల్పిస్తున్న జీవో నెంబర్‌ 3ను రద్దు చేయించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరుద్ధరణకు క్యాబినెట్లో చర్చ పెట్టలేదన్నారు. బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితా చేర్పించుటకు శతవిధులా ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన ప్రాంతంలో ఉద్యమం ద్వారా ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. విద్యా సంస్థలలో విద్యార్థి, గిరిజన ప్రజా సంఘాల ప్రవేశం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్యం అని విమర్శించారు. గిరిజన సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్లించి నవరత్నాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. దీంతో గిరిజన ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పి.లక్కు, జిల్లా ఉపాధ్యక్షుడు కె.నరసయ్య, మండల కార్యదర్శి ఎస్‌.చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం
రాజ్యాంగ రాజ్యాంగ విరుద్ధం : సురేంద్ర
ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌: ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణాలను ప్రభుత్వం విరమించుకోవాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్‌ చేశారు. మంగళవారం అరకువేలి గిరిజన సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సురేంద్ర మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టానికి విరుద్ధంగా,గిరిజనేతరులకు అటవీ భూమి కేటాయిస్తే సహించేది లేదని పేర్కొన్నారు.5వ షెడ్యూల్డ్‌ ఏరియాలో నిబంధనలకు వ్యతిరేకంగా హైడ్రో పవర్‌ ప్రాజెక్టు కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించాడని గిరిజన సంఘంగా తీవ్రంగా ఖండిస్తుంన్నామని చెప్పారు. గిరిజన చట్టాలను తుంగలో తొక్కడం అన్యాయమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలన, లేనియెడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలుకుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్న, గిరిజన సంఘం మండల నాయకులు జి.చిన్నబాబు, తదితులున్నారు.