ప్రజాశక్తి -అనంతగిరి:గిరిజనులకు నష్టం చేకూర్చే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిరాణాన్ని అడ్డుకుంటామని, దీనిపై పోరాటం చేస్తామని అల్లూరి సీతారామరాజు సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స తెలిపారు. అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ చిట్టంపాడు గ్రామంలో సిపిఎం ప్రతినిధి బృందం పర్యటించింది. హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రభావిత అటవీ ప్రాంతాన్ని, గ్రామాలను పరిశీలించారు. చిటంపాడు, డి.కంభవలస, నందనపురం, కొత్తవలస తదితర గ్రామాల గిరిజనులతో మాట్లాడారు. అనంతరం అల్లూరి సీతారామరాజు సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడుతూ, గిరిజన హక్కులు, చట్టాలను ధిక్కరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహిస్తామని తెలిపారు. హైడ్రో పవర్ ప్రాజెక్టును కార్పొరేట్ సంస్థలైన అదానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి మంజూరు చేయడం తమ రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. ఈ ప్రాంతంలో ఏళ్లుతరబడి ఆదివాసులు నివసిస్తున్నారని, ప్రాజెక్ట్ నిర్మాణంతో పరిసర ప్రాంతాల్లో వ్యవసాయంతో పాటు చింత, పనస, జీడీ మామిడి, సీతాఫలం వంటి అటవీ ఉత్పత్తులు కోల్పోపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పీసా చట్టం, పంచాయతీ గ్రామ సభ ఆమోదం, గిరిజన సలహా మండలి తీర్మానం లేకుండా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం రాజ్యాంగ విరుద్ధం అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా కార్పొరేట్ సంస్థలకు హైడ్రో పవర్ ప్రాజెక్టు కేటాయించడాన్ని వ్యతిరేకించాలని గిరిజనులకు పిలుపునిచ్చారు.
చట్టాలు ఉల్లంఘన
: గంగరాజు
జెడ్పీటీసీ దీసరి గంగరాజు మాట్లాడుతూ, గిరిజన హక్కులు, చట్టాలు ఉల్లంఘించి నరేంద్ర మోడి, జగన్మోహన్ రెడ్డిలు కలిసి కార్పొరేట్ సంస్థలకు గిరిజనుల భూములు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతి ఒక్క గిరిజనుడు పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పెదకొట పంచాయతీ కుడియా, గుమ్మకొట పంచాయతీ పరిధిలో గుజెళ్లి గ్రామాల్లో కూడా ఈ ప్రోజెక్టుల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టోకూరు సర్పంచ్ కిల్లో మోస్య, సీపీఎం మండల కార్యదర్శి సోమెల నాగులు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పి.బాలదేవ్, గిరిజన సంఘం మండల అధ్యక్షులు సీవేరి .కొండలరావు, సీపీఎం నాయకులు గెమ్మెల. దేవన్న, భీమరాజు, చిట్టంపాడు వాటర్ ఫాల్స్ అభివృద్ధి కమిటీ సభ్యులు సమర్డి లక్ష్మణ్, అప్పన్న, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు. దొన్ను, సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.










