Jan 06,2023 23:49

మాట్లాడుతున్న అప్పలనర్స

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌: గిరిజనులకు నష్టాన్ని కలిగించే హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ అనుమతులు రద్దు చేయాలని ఉద్యమం ఉధృతం చేస్తామని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనరస తెలిపారు. అరకువేలి గిరిజన సంఘం కార్యాలయంలో అల్లూరి జిల్లా సిపిఎం జిల్లా విస్తత కార్యకర్తల సమావేశం రెండు రోజుల పాటు నిర్వమించారు. ఈ సందర్భంగా అప్పలనరస మాట్లాడుతూ, అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ రెగులపాలెం, చిట్టెంపాడు, గుజ్జలి, చింతపల్లి మండలం ఎర్రవరంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడాన్ని సిపిఎం వ్యతిరేకిస్తుందన్నారు. సిపిఎం ప్రతినిధి బృందం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మిస్తున్న అటవీ ప్రాంతాన్ని, గ్రామాలను ఇప్పటికే పర్యటించిందన్నారు. గిరిజన హక్కులు, చట్టాలను ధిక్కరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ పై గిరిజనులు ఉద్యమం చేయాలన్నారు. కార్పొరేట్‌ సంస్థలైన అదానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి మంజూరు చేయడం తమ రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. సెల్‌ పోన్‌ టవర్‌ ఏర్పాటు చేస్తామని మాయమాటలు గిరిజనులకు చెప్పి హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి డ్రోన్‌లతో సర్వే నిర్వహించడం ఎంతవరకు సబబని ప్రశ్న్చింఆరు.అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం పంచాయతీ గ్రామ సభ ఆమోదం, గిరిజన సలహా మండలి తీర్మానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆధాని కార్పొరేట్‌ సంస్థలకు హైడ్రో పవర్‌ ప్రాజెక్టు కేటాయించడాన్ని గిరిజనులు వ్యతిరేకించాలన్నారు. 1997లో నిమ్మలపాడు మైనింగ్‌ కేసులో సుప్రీం కోర్టు తీర్పును దిక్కరించడం తగదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందించలేని ప్రభుత్వం హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ బాధితులను ఆదుకుంటామని, ఉపాధి కల్పిస్తామని మాయమాటలు చెప్పడం దారుణ మన్నారు. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నివేదికను రూపొందించడం సరికాదన్నారు. ప్రాజెక్టుల పేరుతో కార్పొరేట్‌ సంస్థలకు గిరిజనుల భూములు కట్టబెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ అనుమతి రద్దు చేయాలని ఈనెల 11న మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, అనంతగిరి జెడ్పిటిసి ధీసరి గంగరాజు, వి.ఉమామహేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎస్పీ పోతురాజు, బొండ సన్నిబాబు, జయ, రామారావు, టోకూరు సర్పంచ్‌ కిల్లో మోస్య, సీపీఎం మండల కార్యదర్శి సోమెల నాగులు పాల్గొన్నారు.