ప్రజాశక్తి-హుకుంపేట:చింతపల్లి, కొయ్యూరు మండలాల సరిహద్దు ప్రాంతమైన గిందిపాకల పంచాయితి సమగిరి, ఎర్రవరం సమీప అటవీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఎవరి కోసం అని, గిరిజన గ్రామాలను ముంచడానికా, వైసిపి వ్యాపారం కోసమా అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి కిడారి శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. మండల కేంద్రంలో శుక్రవారం మీడియా సమావేశంలో కిడారి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో అడవిని నమ్ముకుని ఏళ్ల తరబడి జీవిస్తున్న గిరిజనులను అడవి నుండి వెళ్లగొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని ఆయన ధ్వజమెత్తారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేశామన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా గిరిజన ప్రాంతంలో కార్పొరేట్ కంపెనీలు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం సరికాదని ఆయన అన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో 32 గ్రామాల ప్రజలు, సుమారుగా 6000 మంది జనాభా అన్యాయంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. గిరిజన ప్రాంతంలో మచ్‌ఖండ్, సిలేరులో పవర్ ప్రాజెక్ట్ లు ఉన్నపటికీ గిరిజన ప్రాంతంలో ఉచిత ఉద్యుత్ ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సిరగాం సూర్యాకాంతం, రాష్ట్ర ఎస్టీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ సాగర సుబ్బారావు, టీడిపి సీనియర్ నాయకులు శెట్టి లక్ష్మణుడు, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి బాకురు వెంకటరమణరాజు, దారెల సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి, అరకు పార్లమెంట్ టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు తామర్ల సత్యనారాయణ, స్థానిక ఎంపీటీసీ కొమ్మ రమ, మండల తెలుగు యువత అధ్యక్షుడు పల్టాసింగి కామేశ్వరరావు, అరకు అసెంబ్లీ తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ అచ్చిబాబు, వార్డు మెంబర్ వెంకట్, కొర్ర నాగబాబు, టీడిపి యువ నాయకులు తాంగుల మహేష్, శివ సాగర్, త్రినాథ్, మహేష్, రాజు, మురళి పాల్గొన్నారు.










