ప్రజాశక్తి -అరకులోయ రూరల్:జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు. అరకువేలి గిరిజన సంఘం కార్యాలయంలో ఆ సంఘం మండల కార్యదర్శి పి.రామన్న అద్యక్షతన బుధవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి, కొయ్యూరు, అనంతగిరి మండలాలలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధాని కంపెనీతో ఒప్పందం చేసుకున్నాయని, వెంటనే వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో పీసా చట్టం, గ్రామ సభ, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా చట్ట విరుద్ధంగా ఆయా మండలాలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌లను ఆదానికి కట్టబెడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అటవీ, పర్యావరణ అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.గిరిజన ప్రాంతాల్లో ఉన్న అడవులను పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. దీంతో గిరిజన ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసి గిరిజనులు నిర్వాసితులవుతారని తెలిపారు. రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించిన చట్టాలు, హక్కులకు రక్షణ కల్పించవలసిన అధికారులు, ప్రజాప్రతినిధులు కాల రాస్తున్నారని మండిపడ్డారు. బీసీ కులస్తులైన బోయ/వాల్మికిలకు గిరిజన జాబితాలో చేర్చాలని తీర్మానం చేయడంతో గిరిజన హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.అనంతగిరి మండలం నిమ్మాలపాడు మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రోజెక్టులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలకు గిరిజన ప్రజలు మద్దతు తెలపాలని పిలుపుచ్చారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి మండల కార్యదర్శి జె.సుబ్బరావు, గిరిజన సంఘం నాయకులు కొండలరావు, బుజ్జిబాబు, గాసి పాల్గొన్నారు.










