ప్రజాశక్తి - పాడేరు:గిరిజన చట్టాలను ఉల్లంఘించి హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఏజెన్సీలో ప్రయివేటు సంస్థలకు కట్టబెడుతూ ప్రభుత్వం ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ చింతపల్లి మండలం ఎర్రవరంలో శుక్రవారం ఎపి గిరిజన సంఘం నిర్వహించిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివచ్చారు. హైడ్రో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. 'మా అడవి జోలికి రావొద్దు. మా జీవనాధార భూములను అమ్మొద్దు, 1/70 చట్టాన్ని పరిరక్షించాలి' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అఖిలపక్ష పార్టీల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు సంఘటితంగా కదిలి వచ్చి హైడ్రో ప్రాజెక్టు ప్రతిపాదనను వ్యతిరేకించారు. గిరిజనులు తీవ్ర ఆగ్రహ నినాదాలతో ఎర్రవరం మార్మోగింది. నెల రోజులుగా హైడ్రో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజన సంఘం నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలపై స్థానికంగా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. గిరిజనులు ఆసక్తిగా తిలకించారు.
ర్యాలీ అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథి, రాజ్యసభ మాజీ సభ్యులు, ఎపి రైతు సంఘం ఉపాధ్యక్షులు పి.మధు మాట్లాడారు. అల్లూరి జిల్లాలో గిరిజనులకు తీవ్ర నష్టం చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టుల ప్రతిపాదనలను విరమించుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆదివాసీ అధికార్ రాష్ట్రీరు మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు అప్పలనర్స మాట్లాడుతూ
ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల ప్రతిపాదనపై గిరిజనుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నందున ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు వైసిపి ఎంపీ, ఎమ్మెల్యేలు కళ్ల బొల్లి మాటలు మాట్లాడుతున్నారన్నారు. హైడ్రో ప్రాజెక్టు ప్రతిపాదనను ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ ప్రాజెక్టు జార్ఘండ్ రాష్ట్రానికి వెళ్లిపోయిందని పాడేరు ఎమ్మెల్యే అంటున్నారని, వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారని ఇలా బూటకపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శిం చారు. నిజంగా ప్రభుత్వం రద్దు చేస్తే పత్రికా ప్రకటన చే యాలని ఆయన డిమాండ్ చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం ఆదివాసీల పట్ల కుట్ర మోసం చేస్తున్నారని, ఇంకా ఈ ప్రాంతంలో గిరిజనులని చెట్టుకొకరిని పుట్ట కొకరిని తోలేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ప్రభుత్వాన్ని విమర్శించారు. యర్రవరంలో ఉన్న గిరిజనులు 300 నుండి 500 ఉన్నారని, ఈ ప్రాంత వాసులకు అన్యాయం జరిగితే గిరిజన సంఘం ఊరుకోదని పునరుధ్ఘాటించారు.జిల్లాలో ఉన్న ఆరున్నర లక్షల మంది గిరిజను లను సంఘటితం చేస్తామన్నారు.
ఏపీ గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ.. హైడ్రో పవర్ ప్రాజెక్టులపై చింతపల్లి ప్రాంతంలో బాధిత గ్రామాల గిరిజనులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఎంపీ, ఎమ్మెల్యేలు ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. ఎక్కడ ఏ ప్రాజెక్టులు నిర్మించినా గిరిజనులు నిర్వాసితులైపోతున్నారని, గిరిజన చట్టాలు, హక్కులు కాల రాస్తున్నారని ధ్వజమెత్తారు. హైడ్రోతో ముప్పు వాటిల్లకుండా గిరిజన సంఘం ముందు చూపుతో పార్టీలకు అతీతంగా ఉద్యమానికి గిరిజనులను సిద్ధం చేస్తోందన్నారు.
గొందిపాకలు సర్పంచ్ వరలక్ష్మి మాట్లాడుతూ.. తాత తండ్రుల కాలం నుంచి ఇక్కడ బతుకుతున్నామని, తమ జీవనాధారం దెబ్బతీస్తే ఊరుకునేది లేదని తెలిపారు.
వైసిపి నాయకుడు, మాజీ ఎంపీటీసీ ఉల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం మోడీ చెబితే ఆదానికి ఈ భూముల్ని కట్టబెడతారా? అందుకేనా అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించిందని అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైడ్రో ప్రాజెక్ట్‌తో సారవంతమైన భూములను కోల్పోతామన్నారు.
ఈ సభలో ఎర్ర బొమ్మలు ఎంపీటీసీ సభ్యుడు చెక్కే సత్తిబాబు, సిపిఐ నాయకులు సూరిబాబు ప్రసంగించారు. గూడెపు కృష్ణంరాజు సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పాంగి ధనుంజరు, సాగిన చిరంజీవి, చింతపల్లి, కొయ్యూరు మండలాలకు చెందిన పలు గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు.










