Dec 14,2022 00:19

మాట్లాడుతున్న సూరిబాబు, చిత్రంలో అప్పలనాయుడు

ప్రజాశక్తి-కొయ్యూరు
కొయ్యూరు, చింతపల్లి మండలాల్లోని గానుగుల రావణాపల్లి, ఎర్రవరం గ్రామాల వద్ద నిర్మించ తలపెట్టిన హైడ్రో ప్రాజెక్టును అదాని కంపెనీకి అప్పగించడాన్ని గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎస్‌.సూరిబాబు తీవ్రంగా ఖండించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం అదానికి ఇచ్చే నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వల్ల రెండు మండలాల్లో 32 గ్రామాలు ప్రజలు భూములు, ఇళ్లు, స్థిరాస్తులు కోల్పోతారని, ఇది తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వానికి తలవంచి క్యాబినెట్లో తీర్మానం చేయడం సరికాదని పేర్కొన్నారు. 1/70, పీలా చట్టాలను తుంగలో తొక్కి, గ్రామసభలు జరగకుండా గిరిజనులను నాశనం చేసే హైడ్రోపవర్‌ ప్రాజెక్టు అనుమతి ఇవ్వడం దుర్మార్గమన్నారు. తనకు మద్దతుగా నిలిచే గిరిజనుల జీవనాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రశ్నార్థకం చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆపే విధంగా మేధావులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వ్యవహరిస్తే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు వై.అప్పలనాయుడు, గిరిజన సంఘం మండల నాయకులు పాల్గొన్నారు.