Oct 03,2021 12:08

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఉత్తరం నేడు పెద్దగా కనిపించడం లేదు. ఎన్నో వార్తలను మోసుకొచ్చే పోస్టుమ్యాన్‌ సైకిల్‌ బెల్లు నేడు మూగబోతోంది. టెక్నాలజీ కారణంగా నేడు క్షణాల్లోనే సమాచారం చేరే పరిస్థితి ఉండడంతో పోస్టు లెటర్‌ అవసరం పెద్దగా లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం ఎన్ని రకాల సమాచార వ్యవస్థలు అందుబాటులోకొచ్చినా.. పోస్టల్‌ సర్వీసులను ఆదరించేవారు, వాటితో అనుబంధం కొనసాగిస్తున్న వారూ లేకపోలేదు. కాలానుగుణంగా జరుగుతున్న మార్పులతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందిపుచ్చుకుంటూ తపాలాశాఖ తన సేవలను విస్తృతం చేసుకుంటోంది. జాతీయ బ్యాంకులకు దీటుగా బ్యాంకింగ్‌ సేవలనూ అందిస్తూ అన్ని వర్గాల అభిమానాన్నీ చూరగొంటోంది. ఒకప్పుడు పోస్టాఫీసు, పోస్టుమాన్లకు ఉన్న ప్రాధాన్యాన్ని తిరిగి కాపాడుకునే దిశగా ఆ శాఖ సిబ్బంది పనిచేస్తున్నారు. ఉత్తరాలు, మనియార్డర్లు, టెలిగ్రామ్‌లు పంపేవారు కరువైన ప్రస్తుత సమయంలో.. సమాచారం వేగంగా చేరవేస్తోంది. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వెనుకబడిపోతోంది. 'ఇన్నోవేట్‌ టు రికవర్‌' అనే థీమ్‌తో ఈ నెల 9న 'ప్రపంచ తపాలా దినోత్సవం' నేపథ్యంలో ప్రత్యేక కథనం..!

 

1



    'తోక లేని పిట్ట తొంభై ఆరు ఊర్లు తిరిగింది!' అని ఉత్తరాన్ని గురించి మన పెద్దలు చెప్పేవారు. అలాంటి ఉత్తరాల పోస్టల్‌ శాఖ మన జీవితంలో చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఉత్తరం మనలోని అనేక భావాలకు చిహ్నం. మారుమూల ప్రాంతాలకు పోస్టల్‌ శాఖ తన సేవలను 1854లో ప్రారంభించింది. మనదేశంలో రైల్వే శాఖ తరువాత రెండో అతిపెద్ద వ్యవస్థ పోస్టల్‌ శాఖ. సెల్‌ఫోన్‌ వచ్చిన తరువాత ఉత్తరాలు రాసేవారు తగ్గిపోయారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సరికొత్త సేవలు మెరుగుపరచి పోస్టల్‌ వ్యవస్థ విస్తరించింది. మొదట్లో ఉత్తరాల వరకే సేవలు కొనసాగినప్పటికీ, కాలానుగుణంగా అనేక సేవలు కొత్తగా ప్రారంభించింది పోస్టల్‌ శాఖ. జాతీయ, అంతర్జాతీయంగా స్పీడ్‌ పోస్ట్‌, స్పీడ్‌ నెట్‌, వారెంట్‌ పేమెంట్‌ స్కీం, ఈ పోస్ట్‌, డైరెక్ట్‌ పోస్ట్‌, ఎలక్ట్రానిక్‌ మనీ ఆర్డర్‌, పోస్టల్‌ బ్యాంకింగ్‌, పోస్టల్‌ సేవింగ్స్‌, సుకన్య సేవింగ్స్‌, ఎటిఎం సేవలతో పాటు, ఆధార్‌ వంటి మరెన్నో సేవలు పోస్టల్‌ శాఖ అందిస్తోంది. ప్రైవేట్‌ రంగంలో కొరియర్‌ సేవలు విస్తరించినా, పోస్టల్‌ శాఖపై ప్రజల ఆదరణ తగ్గలేదు.

'ఎండలో.. వానలో..
ఎండిన.. చివికిన..
ఒక చిన్నసైజు జీతగాడు..
చెవిలో పెన్సిల్‌..
చేతిలో సంచీ..
కాకీ దుస్తులు..
అరిగిన చెప్పులు..
ఒక సాదా పేదవాడు
ఇంటింటికీ.. వీధివీధికీ
ప్రతి రోజూ తిరిగేవాడు - ప్రైమినిస్టరా ఏం..

అయితే చూడు
ఆ కిటికీలో రెండు విచ్చిన కలువల్లాంటి కళ్లు
ఆ వీధి మొగవైపే ప్రసరిస్తోన్న చూపుల ముళ్లు
ఆ కళ్లల్లో ఆతృత
ఆ గుండెల్లో గడచిన
దేశాంతర గతుడైన ప్రియుడి వార్త కోసం
అమ్మాయీ
పెద్దెనిమిదేళ్ల పడుచుదనాన్ని భద్రంగా దాచి
పళ్లెరంలో పెట్టి ప్రాణనాథుడి కందించాలనే
నీ ఆశ నాకు అర్థమయ్యింది..

2

గుడిసెముందు కూర్చున్న పండు ముసలి అవ్వ
గడచిన బ్రతుకంతా కష్టపు నెత్తుటి కాలవ
కనపడీ కనపడని కళ్లల్లో
కొడిగట్టిన ప్రాణపు దీపంతో
తాను కనిన ప్రాణం, తనకు మిగిలిన ఒకే ఒక స్వప్నం
తన బాబు తన ఊపిరి
అస్సాం రైఫిల్సులో సోల్జర్‌ సిమ్మాచలం
కోసం నిరీక్షణ
క్షణ క్షణ ప్రతీక్షణ
ఒక కార్డుముక్క వ్రాశాడు
బంట్రోతూ వెళ్లు వెళ్లు త్వరగా
ముసలిదానికి మంచివార్త నందించు
ముడతలు పడిన మొహం మీద ఆనందాన్ని పరికించు
దూరభారాన ఉన్న కుమారుని కోసం.. '
అంటూ... దేవరకొండ బాలగంగాధర తిలక్‌ 'అమృతం కురిసిన రాత్రి' కవితా సంపుటిలో 'తపాలా బంట్రోతు' గురించి ప్రస్తావించారు...


                                                          ఆ జ్ఞాపకాలే వేరు..

     ఒకప్పుడు నా కోసం అందరూ ఎదురు చూసేవారు. నేను ఎప్పుడొస్తానా.. అంటూ గడపదగ్గర కాపలా కాసేవారు.. ట్రింగ్‌.. ట్రింగ్‌ మని బెల్లు కొడుతూ పోస్ట్‌.. పోస్ట్‌.. అంటూ పోస్ట్‌మెన్‌ అరుస్తూ.. వస్తుంటే.. నా కోసం చెంగు చెంగున పరిగెత్తుకుంటూ వచ్చేవారు. నన్ను చూడగానే.. ఏదో ఆత్మీయ భావన కలుగుతుండేది. నేను తెచ్చే కబురు కోసం కళ్లు కాయలు కాసేలా చూసేవారు. పేర్లు తర్వాత ప్రేమతో, ప్రియమైన, డియర్‌ అంటూ రకరకాలుగా రాస్తూ.. తమలోని భావాలాలను నా ద్వారా పంచుకునేవారు. ఎవరి నుండైనా అందుకొన్న ఉత్తరం చదివితే ఆ అనుభూతే వేరు. ఉత్తరం తీపి కబుర్ల తాయిలం. ఉద్యోగ సమాచారం కావచ్చు, బంధువుల మరణవార్త కావచ్చు.. ఎలాంటి భావోద్వేగాల్నైనా బట్వాడా చేసేదాన్ని. సామాజిక మాధ్యమాలు (ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టా, ట్విట్టర్‌) రాకతో.. నన్ను పూర్తిగా మర్చిపోయారు. అయితే ఇప్పటికీ కొంత మంది నన్ను తమ జ్ఞాపకాలుగా దాచుకునేవారూ ఉన్నారు. పాత తరం వారైతే నన్ను చదవగానే ఓ తీగకు గుచ్చి, గుర్తొచ్చినప్పుడల్లా చదువుతూ ఉండేవారు. ప్రస్తుతం ఈ మెయిల్స్‌, మెసెంజర్స్‌, చాట్‌ యాప్స్‌ రాకతో నన్ను మర్చిపోతున్నారు. కనీసం జ్ఞాపకాల కోసమైనా నాకు మరోసారి వైభవాన్ని తీసుకొస్తారని ఆశిస్తున్నాను.
 

                                                         చరిత్ర, ప్రాముఖ్యత..

   ఒకసారి చరిత్రలోకి వెళ్తే మెసెంజర్ల రూపంలో తపాలా సర్వీసులుండేవి. అంతకుముందు పక్షులు, గుర్రాలను ఉపయోగించి రాయబారాలు చేరవేసేవారు. 1600 - 1700 సంవత్సరాల్లో అనేక దేశాలవారు జాతీయ తపాలా వ్యవస్థలను నెలకొల్పుకొని, ఆయా దేశాల నడుమ తపాలా సౌకర్యాల్ని కల్పించుకునేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. 1800 నాటికి ఈ సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అంతర్జాతీయ తపాలా పంపిణీ క్లిష్టంగా మారిపోయింది. అయితే స్కాట్లాండ్‌లోని సంక్వార్‌లోని హైస్ట్రీట్‌లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పోస్టాఫీసు ఉందని బ్రిటిష్‌ పోస్టల్‌ మ్యూజియం పేర్కొంది. ఇక్కడి ఆధారాల ప్రకారం ఈ పోస్టాఫీసు 1712 నుంచి నిరంతరాయంగా పనిచేసింది. ఆ రోజుల్లో గుర్రాలు, స్టేజ్‌ కోచ్‌లు మెయిల్స్‌ తీసుకెళ్లేవి.

9


 

                                                           అలా మొదలైంది..

    వాస్తవానికి పోస్టాఫీసు వ్యవస్థ 1840లోనే మొదలైంది. ఇంగ్లండ్‌లో సర్‌ రోలాండ్‌ హిల్‌ ఈ పద్ధతిని ప్రారంభించాడు. అయితే ఆ సమయంలో అమెరికాకు చెందిన పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ మాంట్‌ గోమెరి బ్లెయిర్‌ 1863లో 15 యూరోపియన్‌, అమెరికన్‌ దేశాల ప్రతినిధులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ అంతర్జాతీయ ఒప్పందం మాత్రం కుదరలేదు. 1874లో నార్త్‌ జర్మన్‌ కాన్‌ఫెడరేషన్‌కు చెందిన ఓ సీనియర్‌ పోస్టల్‌ అధికారి హెయిన్‌రిచ్‌ వాన్‌ స్టీఫెన్‌ స్విట్జర్లాండ్‌లోని బెర్నెలో 22 దేశాల ప్రతినిధులతో సదస్సు ఏర్పాటు చేశాడు. ఆ ఏడాది అక్టోబరు తొమ్మిదిన ప్రతినిధులు బెర్నె ఒప్పందంపై సంతకాలు చేసి, జనరల్‌ పోస్టల్‌ యూనియన్‌ను నెలకొల్పారు.
    ఈ యూనియన్‌లో సభ్య దేశాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. యూనియన్‌ పేరు 1878లో యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌గా మారింది. ఇది 1948లో ఐక్య రాజ్యసమితికి ప్రత్యేక ఏజెన్సీగా రూపాంతరం చెందింది. 1969లో అక్టోబరు 1 నుంచి నవంబరు 16 వరకూ జపాన్‌ టోక్యోలో 16వ యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌ (యుపియు) కాంగ్రెస్‌ను నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రతినిధులు అక్టోబరు 9న 'వరల్డ్‌ పోస్టల్‌ డే' ని నిర్వహించాలని తీర్మానించారు. ప్రస్తుతం యుపియులో 192 సభ్య దేశాలున్నాయి.
 

                                                              మన దేశంలో..

    ఈస్ట్‌ ఇండియా కంపెనీ మన దేశంలో మొదట ముంబై, చెన్నరు, కోల్‌కతాలో 1764-1766 మధ్య 'కంపెనీ మెయిల్‌' పేరుతో పోస్టల్‌ సేవలు ప్రారంభించింది. వారెన్‌ హేస్టింగ్స్‌ గవర్నరుగా ఈ తపాలా సర్వీసులను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారు. 1776లో లార్డ్‌ క్లైవ్‌ తపాలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1774లో వారన్‌ హేస్టింగ్స్‌ కోల్‌కతా ఆఫీసును ప్రారంభించగా, తర్వాత 1786లో మద్రాస్‌ జనరల్‌ పోస్టాఫీసును, 1793లో ముంబయి జనరల్‌ పోస్టాఫీస్‌లను ఏర్పాటు చేశారు. 1854లో లార్డ్‌ డల్హౌసీ ద్వారా క్రౌన్‌ సర్వీస్‌గా మార్పు చేశారు.

 

3


 

                                                          వ్యవస్థాగత మార్పులు..

    రైల్వే తర్వాత దేశంలో తపాలాయే పెద్ద వ్యవస్థ. దీనిలో వ్యవస్థాగతంగా అనేక మార్పుచేర్పులు చోటుచేసుకొంటున్నాయి. తపాలా వ్యవస్థ మనదేశంలో ప్రభుత్వంలో సమాచార మంత్రిత్వ శాఖలోని భాగం. దీని నియంత్రణ 'తపాలా సర్వీస్‌ బోర్డు' ఆధీనంలో ఉంటుంది. ప్రస్తుతం మనదేశంలో మొత్తం 23 తపాలా సర్కిల్స్‌ ఉన్నాయి. ప్రతీ సర్కిల్‌కు ప్రధాన తపాలా జనరల్‌ అధికారి ఉంటారు. ఇవికాకుండా భారత రక్షణ వ్యవస్థ కోసం ప్రత్యేకమైన సర్కిల్‌ ఏర్పాటు చేయబడింది.
తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో 810 హెడ్‌ పోస్టాఫీసులు, 24,599 సబ్‌ పోస్టాఫీసులు, 1,31,312 బ్రాంచి పోస్టాఫీసులు, 4,44,266 పోస్టు బాక్సులు ఉన్నాయి. ప్రస్తుతం చూస్తున్న లెక్కల ప్రకారం.. 2017తో పోలిస్తే చాలా వరకూ సంఖ్య తగ్గిందనే చెప్పొచ్చు.
 

                                                      సుబ్రమణియన్‌ కమిటీలో..

    తపాలా విభాగాన్ని అన్నివిధాలా పరిపుష్టీకరించాలని సుబ్రమణియన్‌ కమిటీ ఏనాడో ప్రతిపాదించింది. బ్యాంకింగ్‌ ఒక్కటే కాదు.. బీమా, ఇ-కామర్స్‌ సేవల విస్తరణనూ తపాలాతో ముడిపెట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఇతర దేశాల పురోగతిని ఉదాహరణ సహితంగా ఆ సంఘం తేటతెల్లం చేసింది. విస్తృత తపాలా వ్యవస్థ గల భారత్‌లో స్పీడ్‌పోస్టు కేంద్రాల సంఖ్య 200కు చేరడానికే ఎంతో కాలం పట్టింది. ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా నిధుల విడుదల, చెల్లింపు బాధ్యతల్ని చాలాకాలం పాటు తపాలాశాఖ వహించింది. దాని పనితీరుపై అప్పట్లో వచ్చిన విమర్శలు, ఫిర్యాదులు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం మారినా దిద్దుబాటు చర్యలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
 

                                                            వివిధ దేశాల్లో..

    అనేక తపాలా సేవలకు కెనడా ప్రసిద్ధి. మనదేశం మాదిరిగా అక్కడా గతంలో ఆర్థిక గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. అన్ని తపాలా కార్యాలయాలకూ ప్రాథమిక సదుపాయాలు కల్పించి, అక్కడివారికి సంపూర్ణ శిక్షణనిస్తే తప్ప వెలుగులు రావని కెనడా ప్రభుత్వం ఆనాడే గ్రహించింది. సంస్థాగత, ఆధునీకరణ ప్రక్రియలకు భారీయెత్తున నిధులు కేటాయించింది. 'సృజనతో విస్తరణ' పేరిట ఎన్నో వినూత్న పద్ధతులకు ఆ దేశం శ్రీకారం చుట్టింది. అంతే సమర్థ వంతంగా వాటిని అమలుచేసిన కారణంగానే, కెనడాలోని తపాలా పొదుపు బ్యాంకులు సేవా రంగంలో దూసుకెళ్లాయి. బ్రెజిల్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ తపాలా బ్యాంకులు విస్తృత సేవలు అందిస్తున్నాయి. ఫ్రాన్స్‌, న్యూజిలాండ్‌ దేశాల తపాలా శాఖలు ఎప్పుడో పుష్కర కాలం క్రితమే సొంత బ్యాంకింగ్‌ వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్నాయి. తపాలా పొదుపు పథకాల అమలుకు ఇటలీ ఏనాడో పెద్దపీట వేసింది. పనిగంటలు పెంచడం, కొరియర్‌ సేవల్ని ఇంటింటికీ చేరువ చేయడంలో స్విస్‌ ప్రభుత్వం ముందుంది.

4


 

                                                    కాలం చెల్లిన విధానాలు..

    పల్లెసీమల్లోని తపాలా కార్యాలయాలకు అధునాతన చరవాణి యంత్రాలు (స్వైపింగ్‌) అందజేస్తామని, వాటి ద్వారా గ్రామీణులు డబ్బు లావాదేవీలు సాగించవచ్చని కేంద్రం చెబుతోన్నా పూర్తిగా ఆచరణ లేదు.. నూట పాతికేళ్ల చరిత్ర కలిగిన 'మనీ ఆర్డర్‌' విధానం కేవలం ఓ జ్ఞాపకంగా మిగిలిందిప్పుడు. 'టెలిగ్రామ్‌' తరహాలోనే దానికీ ముగింపు పలికారు. 'ఎలక్ట్రానిక్‌', 'ఇన్‌స్టంట్‌ ఎంఓ'లు వచ్చాక పాత పద్ధతులు కనుమరుగయ్యాయి. నూతన ప్రక్రియలతో ముందడుగు వేస్తున్నామని పదేపదే ప్రకటించే కేంద్ర ప్రభుత్వం, అందుకు తగిన స్థాయిలో జాగ్రత్తలు తీసుకోలేకపోతోంది. వ్యవస్థాగత లోటుపాట్లతో పాటు పలు నిర్వహణా లోపాలు, సాంకేతిక సంబంధ అవరోధాలు, క్షేత్రస్థాయిలోని సిబ్బందికి శిక్షణ వసతుల కొరత - ఇప్పటికీ వేధిస్తున్నాయి. దేశంలోని తపాలా కార్యాలయాల్ని ఉపాధి కల్పన కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని చాటిచెప్పినా, వాస్తవానికి ఆ వేగమేదీ కనిపించడం లేదు. వాతావరణ సమాచారాన్ని రైతులకు పక్కాగా తెలియజేసేలా తపాలాశాఖ ఓ ఒప్పందాన్ని శాస్త్ర, సాంకేతిక విభాగంతో కుదుర్చుకుంది. ఫలితం అంతంత మాత్రమే. వినియోగదారులకు మరెంతో దగ్గరయ్యామని ప్రకటించుకోవడమే గానీ, ఆచరణలో అదే లోపిస్తోంది. యాభై కిలోమీటర్ల పరిధిలోని ప్రతి పోస్టాఫీసులోనూ వివిధ రకాల సేవల విస్తరణ- హామీ దశ దాటని పరిస్థితే ఇప్పటికీ కనిపిస్తోంది.
 

                                                        ఇంటివద్దకే సేవలు..

    ఇటీవల కాలంలో ఇండియన్‌ పోస్టల్‌ సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగానే ఐపీపీబీ మొబైల్‌ యాప్‌ పేరుతో డిజిటల్‌ సేవలను అందిస్తోంది. దీని ద్వారా ఖాతాదారులకు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలను అందిస్తోంది. అంతేకాకుండా పోస్టాఫీస్‌లో ఖాతా తెరవడానికి కూడా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్‌లోనే చేసుకోవచ్చు. పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ ఖాతా తెరవాలంటే ఖాతాదారునికి 18 ఏళ్లు నిండి వుండాలి. అలాగే భారతీయ పౌరుడై ఉండాలి. ఇందుకోసం ముందుగా 'ఐపీపీబీ మొబైల్‌ బ్యాంకింగ్‌' యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇందులో అవసరమైన వివరాలు అందించి, మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా ఖాతాను పొందవచ్చు.
 

5

                                                        విదేశీ కొరియర్‌ సర్వీసులు...

   'విదేశాల్లోని తన కొడుక్కి పచ్చళ్లు, పిండి వంటలు పంపడానికి అనేక వ్యయప్రయాసలు పడ్డానని' తూర్పుగోదావరికి చెందిన సుబ్బాయమ్మ వాపోయింది. 'విదేశాల్లో చదువు కోసం వెళ్లిన తన మేనల్లుడికి మందులు, ఇతర వస్తువులు పంపేందుకు ప్రైవేటు కొరియర్‌ కంపెనీలు చుట్టూ తిరిగి వారు చెప్పే ఛార్జీలు చూసి కంగుతిన్నానని' తెనాలికి చెందిన వెంకట్రావు చెప్పారు. అయితే ఇలాంటి సర్వీసులన్నీ మన తపాలా శాఖ అందిస్తుందని తెలుసుకుని 'తాను పంపాలనుకున్న ప్యాకింగ్‌ని సులభంగా పంపేశానని' విజయవాడకు చెందిన అనంత లక్ష్మి చెబుతోంది. అయితే తపాలా శాఖ అందిస్తున్న సర్వీసులపై సరైన ప్రచారం కల్పించక పోవడంతో వీరిలాగే అనేక మంది ప్రైవేటు కొరియర్‌ కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ కామర్స్‌ పరిశ్రమ పెరుగుదలతో దేశీయ కొరియర్‌ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. మందులు, ఆహార ఉత్పత్తులు, గృహోపకరణాలు, స్టేషనరీ వస్తువులు, కార్పొరేట్‌ బహుమతులు, ఫర్నిచర్‌, రసాయనాలు, పుస్తకాలు, బొమ్మలు వంటి అనేక వస్తువులను సురక్షితంగా బట్వాడా చేస్తోంది తపాలా శాఖ.
 

                                                        సంస్కరణల ఫలితం..

    దేశంలో ఆర్థిక సంస్కరణల ఫలితంగా ప్రభుత్వరంగ సంస్థల అభివృద్ధి దశాబ్దాలుగా ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఫలితంగా ప్రైవేటు సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు మధ్య అంతరాల్ని తొలగించాల్సిన సాంకేతికతకు ప్రభుత్వాలు ఎటువంటి ప్రాధాన్యమూ ఇవ్వడం లేదు. గ్రామీణుల గుండె చప్పుడుగా ఉండే తపాలా శాఖకు డిజిటల్‌ వన్నెలద్దాలని చెబుతున్నప్పటికీ ఆచరణ సాధ్యం కావడంలేదు. శతాబ్దాల చరిత్ర కలిగిన తపాలా శాఖ అందించాల్సిన సేవలను అనేక ప్రైవేటు ఈ కార్ట్‌లు ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రజల వస్తువుల భద్రతకు ఏమాత్రం ఆస్కారం లేని ప్రైవేటు సంస్థలు రాజ్యమేలుతున్నాయి. ఫలితంగా అనేక మంది లబ్ధిదారులు మోసాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి సాంప్రదాయ సేవలకు ప్రతీక అయిన తపాలాకు.. ఆధునిక సాంకేతిక విలువల జోడింపు ద్వారా ఉనికిని నిలబెట్టి.. కనుమరుగవుతున్న పోస్టల్‌ శాఖకు భవిష్యత్‌లోనైనా పూర్వవైభవం తీసుకురావాలని ఆశిద్దాం.

 

6



                                                      తపాలా రంగంలో మైలురాళ్లు..

  • 1854లో పోస్టాఫీస్‌ చట్టం
  • 1880లో మనీ ఆర్డర్‌ సేవలు ప్రారంభం
  • 1986లో నేషనల్‌ స్పీడ్‌ పోస్ట్‌ ప్రారంభం
  • 1994లో ఇంటర్నేషనల్‌ స్పీడ్‌ పోస్ట్‌ సేవలు ప్రారంభం
  • 2004లో ఈ పోస్ట్‌ ప్రారంభం
  • 2005లో డైరెక్ట్‌ పోస్ట్‌ ప్రారంభం
  • 2008లో ఎలక్ట్రానిక్‌ మనీఆర్డర్‌
  • 2009లో ఎటిఎం సేవలు
  • 2011 పార్సెల్‌ సేవలు ప్రారంభం
  • 1850లో ప్రారంభించిన టెలిగ్రామ్‌ సేవలు,
  • జులై 15 2013న రద్దు చేశారు.
  • మొదటి టెలిగ్రామ్‌ను కోలకతా నుండి డైమండ్‌ హార్బర్‌కు పంపారు
  • 1972లో ఆగష్టు 15న మనదేశంలో పిన్‌కోడ్‌ వ్యవస్థ ప్రారంభం
  • ప్రపంచంలో మొదటి తపాలా బిళ్ల బ్రిటన్‌లో విడుదలైంది.
  • మనదేశంలో మొదటి తపాలా బిళ్ల 1852లో కరాచీలో విడుదలైంది. దీని పేరు సింధ్‌ డాక్‌.
  • మనదేశంలో అత్యంత ఎత్తయిన పోస్టాఫీస్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాజా పోస్టాఫీస్‌. ఇది సముద్ర మట్టానికి 4700 మీటర్ల ఎత్తులో ఉంది.
  • భారత్‌లో 100వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలో తొలి మహిళా తపాలా కార్యాలయాన్నిఢిల్లీలో ప్రారంభించారు. ఇక్కడ పనిచేసే వారందరూ మహిళలే.


                                                             ఆసక్తికర అంశాలు

7
  • మిర్రర్‌' పత్రిక కథనం ప్రకారం ప్రపంచంలో అన్నింటి కంటే విలువైన పోస్టల్‌ స్టాంప్‌ 55,50,000 పెన్నీ (బ్రిటీష్‌ పెన్నీ) ఇటీవలి కాలంలో బ్రిటీష్‌ మెజెంటా స్టాంప్‌ విలువ మునుపటి కంటే ఎక్కువగా 95 లక్షల డాలర్లలో ఉంది. ఇది 1856లో బ్రిటిష్‌ గయానాలో పరిమిత సంఖ్యలో జారీ చేయబడింది. ప్రస్తుతం ఒకటి మాత్రమే ఉనికిలో ఉంది. బ్రిటిష్‌ రాయల్‌ ఫిలాటెలిక్‌ సేకరణలో ప్రాతినిధ్యం వహించని ఏకైక ప్రధాన తపాలా బిళ్ల ఇది.
  • మన దేశంలో మొదటిసారి పోస్టల్‌ స్టాంప్‌ను 1852లో విడుదల చేశారు. కాగా క్వీన్‌ విక్టోరియా చిత్రంతో మొదటి సచిత్ర పోస్టల్‌ స్టాంప్‌ 1, అక్టోబర్‌ 1854లో విడుదలయ్యింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి పోస్టల్‌ స్టాంప్‌ను నవంబరు 21, 1947న విడుదల చేశారు. అప్పుడు విడుదల చేసిన ఈ స్టాంప్‌ విలువ 1.5 అణాలు. దేశంలో అతిపెద్ద పోస్టల్‌ స్టాంప్‌ మాత్రం ఆగస్ట్‌ 20, 1991న విడుదలైంది.
  • గాంధీజీ చిత్రంతో కూడిన పోస్టల్‌ స్టాంప్‌ వేలంలో ఐదు లక్షల పౌండ్లకు ఇంగ్లండ్‌లో అరుదైన పోస్టల్‌ స్టాంప్‌లను 2017 ఏప్రిల్‌లో వేలం వేశారు. అక్కడ రూ.10 విలువ కలిగిన గాంధీబొమ్మ ఉన్న నాలుగు స్టాంప్‌లను ఐదు లక్షల పౌండ్లకు కొనుగోలు చేశారు. అయితే కొంత మంది పోస్టల్‌ స్టాంప్‌ కలెక్షన్‌ హాబీగా వివిధ రకాల స్టాంపులను సేకరిస్తుంటారు.
8
  • ఉత్తరాల బట్వాడాలో వేగం, కచ్చితత్వాన్ని సాధించడానికి 1972 ఆగస్టు 15న మన దేశంలో పిన్‌కోడ్‌ (పిఐఎన్‌-పోస్టల్‌ ఇండెక్స్‌ నంబర్‌) విధానాన్ని ప్రవేశపెట్టారు. పిన్‌కోడ్‌లో ఆరు అంకెలు ఉంటాయి. మొదటి అంకె జోన్‌ను, రెండో అంకె సబ్‌జోన్‌ను, మూడో అంకె జిల్లాను, చివరి మూడంకెలు డెలివరీ పోస్టాఫీసును తెలియజేస్తాయి. దేశాన్ని మొత్తం 9 పిన్‌కోడ్‌ జోన్లుగా విభజించారు.

 

ఉదయ్ శంకర్‌ ఆకుల
79897 26815