ప్రజాశక్తి-సీతమ్మధార : హాస్యప్రియ కామెడీ క్లబ్ పదో వార్షికోత్సవాన్ని పౌర గ్రరథాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన కామెడీ స్కిట్స్ షాపింగ్, హాస్పిటల్, సెల్ సందడి, అసలు ఏం జరిగింది, సర్టిఫికెట్, ఆహూతులను కడుపుబ్బా నవ్వించాయి. అనంతరం హాస్యప్రియ క్రియేషన్స్ నిర్మించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ప్లాస్టిక్ ఫ్రీ విశాఖ శీర్షికను జివిఎంసి నిర్వహించిన లఘు చిత్రాల పోటీల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన ప్లాస్టిక్ ప్రేమ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, హాస్యాన్ని ఆస్వాదించడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుందన్నారు. జివిఎంసి డిప్యూటీ మేయర్ శ్రీధర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ ప్రేమ లఘు చిత్రం అద్భుతంగా ఉందన్నారు. హాస్య ప్రియకామెడీ క్లబ్ అధ్యక్షులు ఈమంది ఈశ్వరరావు మాట్లాడుతూ, సంస్థ ప్రారంభమై నేటికి పది సంవత్సరాల పూర్తి చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కామెడీ క్లబ్ అధ్యక్షులు నక్క లక్ష్మణరావు, కోరుకొండ రంగారావు, వేముల భాస్కరాచారి, ప్రవీణ్, శేఖర్, సీతారాం, శతపతి, లలిత, గోపినాయుడు తదితరులు పాల్గొన్నారు.










