ప్రజాశక్తి - సాలూరు : ఎస్టీ, ఎస్సీ, బిసి సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్ధులు గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డి.పండు ఆధ్వర్యాన విద్యార్ధులు బోసుబొమ్మ జంక్షన్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పండు మాట్లాడుతూ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో తాగునీటి కొరత వుందని, అక్కడ హేండ్ బోరు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో ఎఎన్‌ఎంలను నియమించాలని కోరారు. మెనూ ఛార్జీలు పెంచాలని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీని సాలూరు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ బాలమురళీకృష్ణకి వినతిపత్రం అందజేశారు.










