
సాలూరు/పాచిపెంట: మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలని, లేఅవుట్లలో నిర్మాణాలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్ తెలిపారు. మండలంలోని నెలిపర్తి వద్ద గల జగనన్న పట్టణ గృహ లేఅవుట్‌ను పిఒ బుధవారం పరిశీలించారు. లేఅవుట్‌లో అప్రోచ్ రోడ్లు నిర్మాణం, నీటి సదుపాయం కోసం బోర్‌వెల్ డ్రిల్లింగు పనులను వెంటనే మొదలు పెట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా అధికారులను ఆదేశించారు. అనంతరం పాచిపెంట మండలం పి.పి.కోనవలసలో గల ఎపిటిడబ్ల్యుఆర్‌జెసి బాలికల కాలేజీని తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటగది, భోజనాలు హాలు పరిశీలించారు. స్టాకు రూం, రిజిస్టర్లు తనిఖీ చేశారు. హాస్టల్‌లో గల వసతులు, సమస్యల గూర్చి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించాలని హాస్టలు వార్డెన్‌కు, మంచి విద్యను అందించాలని ఉపాధ్యాయులను అదేశించారు. ఈ పర్యటనలో సాలూరు మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగు, గ్రామీణ నీటిసరఫరా విభాగం సిబ్బంది, ఉపాద్యాయులు పాల్గొన్నారు.