హాస్టళ్లలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ సందర్శన
ప్రజాశక్తి-కావలి రూరల్ : విద్యారంగా నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి జిల్లావ్యాప్తంగా చేపట్టిన జీపుజాతా కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్, హాస్టల్, కాలేజీల విద్యార్థులతో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ బందం నాయకులు మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు పి.శ్రీనివాసులు, ఎంవి రమణ మాట్లాడుతూ గవర్నమెంట్ హాస్టల్లో మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థులకు ట్రంకు పెట్టెలు, బెడ్ షీట్లు, ప్లేట్లు, గ్లాసులు, విద్యార్థులకు మెస్‌ఛార్జీలు నామమాత్రంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం నుండి మెస్ బకాయిలు గత నాలుగు నెలల నుండి ఇంతవరకు విడుదల కాలేదన్నారు. ఈ హాస్టల్‌లో ఎక్కువ మంది అవుట్‌సోర్సింగ్ టీచర్లు ఉన్నారని వీళ్లకి పూర్తిస్థాయిలో ప్రభుత్వం నుండి జీతాలు కూడా సక్రమంగా రావడం లేదన్నారు. విద్యార్థులకు ప్రతినెలా ఒక్కసారైనా మెడికల్ చెకప్ కూడా జరగడం లేదని తెలిపారు.
బిసి హాస్టల్-1 వార్డెన్‌ను సస్పెండ్ చేయాలి
మంగళవారం సాయంత్రం వెంగళరావు నగర్‌లోని బిసి హాస్టల్-1 పరిశీలించడానికి ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ బృందం వెళ్లి అక్కడ విద్యార్థులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫూటుగా మద్యం సేవించి హాస్టల్‌కు వచ్చిన వార్డెన్ విద్యార్థి సంఘాల నాయకులను దురుసుగా మాట్లాడారని తెలిపారు. 'ఎవరు పర్మిషన్ ఇచ్చారని, ఇక్కడికి ఎందుకు వచ్చారని, ఇది నా హాస్టల్ పొండి రా బయటకు వెళ్లిపోండి అంటూ భౌతిక దాడికి యత్నించాడని తెలిపారు. పోలీస్ యంత్రాంగాన్ని పిలిపించి తమను బయటికు నెట్టు వేయడం జరిగిందన్నారు. వార్డెన్‌కు నిరసనగా అర్ధరాత్రి రెండు గంటల వరకు నినాదాలు చేశామన్నారు. పట్టణంలో ఉన్న విద్యారంగ సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ జాతా బృందం కృషి చేస్తుందని తెలియజేశారు. అనంతరం ఈ జీపుజాతా కావలి నుండి ఉలవపాడుకు బయల్దేరి వెళ్లింది. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు నరసింహం, శ్రీహర్ష, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాలాజీ, నరేంద్ర, జిల్లా కమిటీ సభ్యులు సుమన్, డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు వంగదాటి శ్రీను, చైతన్య, ఎస్‌ఎఫ్‌ఐ డివైఎఫ్‌ఐ కావలి పట్టణ నాయకులు ఉదరు, అజరు కుమార్, పెంచలనరసింహం, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.










