ప్రజాశక్తి- సీతమ్మధార : అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వ వసతి గహాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్రకుమార్ ఆరోపించారు. సీతమ్మధార ప్రభుత్వ వసతిగహం వద్ద ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, సీతమ్మధార నాలుగో ఎస్‌సి హాస్టల్‌లో అపరిశుభ్రత, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందకపోవడం వంటి సమస్యలపై అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంపై మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోగా, విద్యార్థులపై ప్రత్యారోపణలు చేయడం భావ్యం కాదన్నారు. హాస్టల్‌లోని నాన్‌బోర్డర్స్‌ను బయటకు పంపడంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెస్‌ఛార్జీల పెంపు, ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు కనీస చర్యలు తీసుకోలేదని, నాడునేడులో అభివృద్ధి చేస్తామని ప్రకటించినా అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి, సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను, జిల్లా సమితి సభ్యులు నాయుడు బాబు, అభి, సత్య పాల్గొన్నారు.










