ప్రజాశక్తి - బుట్టాయగూడెం
ఎస్‌టి బాలికల కళాశాల వసతి గృహ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కెఆర్‌పురం ఐటిడిఎ కార్యాలయంలో పరిపాలన అధికారి(ఎఒ) పివి రామారావుకి పిడిఎస్‌యు ఆధ్వర్యంలో వినతిని అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు ఇ.భూషణం, బి.వినోద్ ఎఒతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం ఎస్‌టి బాలికల కళాశాల వసతి గృహ భవనములు విద్యార్థులకు సరిపోవడం లేదన్నారు. అంతేకాకుండా మరుగుదొడ్ల సదుపాయం కూడా విద్యార్థులకు సరిపోవడం లేదన్నారు. దీనివలన విద్యార్థులు ఉండడానికి, పడుకోవడానికి, కాలకృత్యాలకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. జంగారెడ్డిగూడెం బాలికల వసతి గృహం పైఅంతస్తు భవనముల నిర్మాణం ఎప్పటినుంచో నిలిచిపోయిందని, గ్రిల్స్ కూడా లేవని తెలిపారు. బుట్టాయగూడెం ఎస్‌టి బాలికల వసతి గృహానికి విద్యార్థులు భోజనాలు చేయడానికి డైనింగ్ సదుపాయం కూడా లేదన్నారు. ఈ రకమైన సమస్యలతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ఐటిడిఎ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పరిష్కరించడం లేదని తెలిపారు. కావున వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమస్యలను పరిష్కరించాలని కోరారు.










