Dec 09,2022 23:15

వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు : జెసి
ల్యాబ్‌కు ఆహార, ఐరన్‌ టాబ్లెట్ల శాంపిళ్లు
నిలకడగా విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి : కలెక్టర్‌
ప్రజాశక్తి - చింతలపూడి

              చింతలపూడి సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం వార్డెన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణబాబు అన్నారు. హాస్టల్‌లో గురువారం రాత్రి అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆయన శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భోజనం బాగా చిమిడిపోయి, ఉడికి ఉడకన్నట్లుగా ఉందని, అన్ని శాంపిళ్లూ తీసుకున్నామని తెలిపారు. విద్యార్థులకు అదనపు తరగతి గదుల అవసరం ఉందని, నాడు-నేడులో నూతన గదుల నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. విద్యార్థినుల అస్వస్థతకు కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్‌ చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న విద్యార్థినులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. 18 మంది అస్వస్థతకు గురైనట్లు తేలిందని జెసి చెప్పారు. ఇద్దరు విద్యార్థినులను ఏలూరు తరలించారని, హాస్టల్‌లోనే వైద్య శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు.
హాస్టల్‌ వద్ద ఉద్రిక్తత
శుక్రవారం తెల్లవారుజామున టిడిపి, జనసేన నేతలు విద్యార్థినులను పరామర్శించడానికి వెళ్లారు. ఆ సమయంలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఒక గదిలో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని ఇక్కడ ఎందుకు ఉంచారని సిబ్బందిని నిలదీశారు. తమకు శ్వాస ఆడటం లేదని, వాంతులవుతూ కాళ్లు చేతులు వణుకుతున్నాయని విద్యార్థినులు చెప్పడంతో నేతలు అవాక్కయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించాలని డిమాండ్‌ చేశారు. జెడ్‌పిటిసి నీరజసుధాకర్‌ కారులో ఐదుగురు విద్యార్థినులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సమయంలో హాస్టల్‌ వద్దకు చేరుకున్న వైసిపి నేతలు ఈ ఘటనను రాజకీయం చేయొద్దని అనడంతో టిడిపి, వైసిపి నేతల నడుమ వాగ్వివాదం చోటుచేసుకుంది. చింతలపూడి సిఐ మల్లేశ్వరరావు రంగంలోకి సర్దిచెప్పారు.
ఐరన్‌ ట్యాబ్లెట్లను ల్యాబ్‌కు పంపిస్తాం
జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీత
హాస్టల్‌ను జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీత శుక్రవారం సందర్శించారు. స్థానికంగా ఉన్న పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు. ఐరన్‌ ట్యాబ్లెట్లను ల్యాబ్‌కు పంపిస్తామని చెప్పారు.
విద్యార్థినుల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ లేదు
డిఎంహెచ్‌ఒ రవికుమార్‌
అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ లేదని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి రవికుమార్‌ అన్నారు. హాస్టల్‌, ఆసుపత్రిలో ఉన్న విద్యార్థినులను ఆయన పరామర్శించారు. తీసి సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను పర్యవేక్షించారు.
విద్యార్థినుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్‌
చింతలపూడి వసతి గృహంలోని బాలికల ఆరోగ్య పరిస్థితి నిలకడ గా ఉందని, ఎటువంటి ఆందోళనా చెందనవసరం లేదని జిల్లా కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ చెప్పారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు బాలికలను ఆయన పరామర్శించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ హాస్టల్‌లో 18 మంది విద్యార్థినులు గురువారం రాత్రి భోజనం చేసిన అనంతరం కడుపునొప్పి, వాంతులు కారణంగా అస్వస్థతకు గురయ్యారని, వారికి తక్షణమే వెంటనే చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించారని తెలిపారు. ఇద్దరు మినహా మిగిలిన వారందరికీ చికిత్స అనంతరం వారి ఇంటికి పంపించి వేశారని తెలిపారు.కడుపునొప్పి ఎక్కువగా ఉన్న ఇద్దరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి కూడా ప్రస్తుతం నిలకడ గానే ఉందని, అయినప్పటికీ చికిత్స కొనసాగుతుందని తెలిపారు. ఆహార శాంపిళ్లు సేకరించి పరీక్షకు పంపించినట్లు తెలిపారు. ఘటనపై విచారణకు అధికారిని నియమించామని, నివేదిక అందిన వెంటనే ఘటనకు కారకులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ చెప్పారు.
హాస్టల్‌ను సందర్శించిన ఎన్‌సిడి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మానస
చింతలపూడి హాస్టల్‌లో విద్యార్థినుల అస్వస్థతకు ఐరన్‌ ట్యాబ్లెట్స్‌ కారణం కాదని, అన్ని పాఠశాలల్లో ఐరన్‌ మాత్రలను యధావిధిగా విద్యార్థులకు ఇవ్వాలని ఎన్‌సిడి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, ఆర్‌బిఎస్‌కె పిఒ డాక్టర్‌ సిహెచ్‌.మానస అన్నారు. శుక్రవారం హాస్టల్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్బంగా బాలికల అనారోగ్యానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వసతిగృహంలోని వంటశాలను పరిశీలించారు. ఐరన్‌ టాబ్లెట్లు వేసుకోని బాలికలు కూడా అస్వస్థతకు గురయ్యారని, బాలికల అనారోగ్యానికి ఐరన్‌ టాబ్లెట్లు కారణం కాదని అన్నారు.