
రాజంపేట అర్బన్ : రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గహ వార్డెన్ సంపూర్ణ 10 సంవత్సరాల నుంచి ఒకే హాస్టల్లో విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యతలేని భోజనాన్ని అందిస్తున్నారని, అంతర్జాలంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా చూపుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సర్వేపల్లి నరసింహ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్, జూలై, ఆగస్టు నెలల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉన్నా నెల ఆఖరిలో మాన్యువల్ ఒకరోజు విజయవాడ నుంచి అవకాశం ఇచ్చినప్పుడు విద్యార్థులందరూ వచ్చారని హాజరు వేసుకొని లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఖజానాను వార్డెన్ తప్పుడు బిల్లులు చేసుకొని అధికారులను మోసం చేశారని పేర్కొన్నారు. తక్షణం జూన్, జూలై, ఆగస్టు బిల్లులను క్షుణ్ణంగా పరిశీలన చేసి వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐగా కోరుతున్నామన్నారు. హాస్టల్లో వర్కర్లు ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో వారి పేర్లు పొందుపరచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ విధంగా అవినీతి చేస్తున్న సంపూర్ణను మరొక హాస్టల్‌కు ఇన్‌ఛార్జిగా నియమించి అధికారులు కూడా అవినీతిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తక్షణం ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తొలగించి సంపూర్ణపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ, జిల్లా సహాయ కార్యదర్శి ఉపేంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గోవర్ధన్, సురేష్, హరి, దినేష్ తదితరులు పాల్గొన్నారు.