Apr 19,2023 00:27

జిల్లా గిరిజన సంక్షేమ అధికారికి వినతి పత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి- రేపల్లె : విద్యార్థులకు అస్వస్థతకు గురికావడానికి కారణమైన వార్డెన్‌పై సస్పెండ్‌ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం రాత్రి నాసిరకమైన భోజనం తిని 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు స్పందించారు. ఎస్‌ఎఫ్‌ఐ బాపట్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్య, మనోజ్‌ కుమార్‌ మంగళవారం గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా గిరిజన సంక్షేమ అధికారి దస్తగిరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్య, మనోజ్‌ మాట్లాడుతూ మెనూలో భాగంగా వడ్డించిన సాంబరులో పురుగులు రావడాన్ని విద్యార్థులు గమనించి హాస్టల్‌ పర్యవేక్షకుల దష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. అవి పురుగులు కాదని, తాలింపు గింజలని తింటే ఏమి కాదని చెప్పినట్లు తెలిపారు. అప్పటికే సాంబారుతో భోజనం చేసిన 19 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. హాస్టల్‌ సిబ్బంది కారణంగానే ఇలా జరిగినట్లు తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వారు డిమాండ్‌ చేశారు. హాస్టల్‌ వార్డెన్‌ వారానికి ఒక సారి కూడా హాస్టల్‌కు రావడం లేదని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు.