Apr 28,2023 00:25

హాస్టల్‌ భవనాలను పున:ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే నాగిరెడ్డి, కలెక్టర్‌ మల్లికార్జున

కోరమండల్‌ సిఎస్‌ఆర్‌ నిధులతో ఆధునికీకరించిన  హాస్టల్‌ భవనాలు పున:ప్రారంభం
ప్రజాశక్తి -గాజువాక :
కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ సిఎస్‌ఆర్‌ నిధులు రూ.93లక్షలతో పునర్నిర్మించిన పెదగంట్యాడ మండలం, 74, 75 వార్డుల పరిధిలోని నడుపూరు, దయాళ్‌నగర్‌లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల కాలేజీ హాస్టల్‌ భవనాలను స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున గురవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, తాను చిన్నతనంలో హాస్టల్‌లోనే ఉండి చదువుకున్నానని, కానీ అప్పట్లో ఇన్ని సౌకర్యాలు లేవన్నారు. ప్రభుత్వం నాడునేడు నిధులతో హాస్టళ్లు, ఆసుపత్రులు, విద్యాలయాలను ఎంతో అభివృద్ధి చేస్తోందన్నారు. దీనికి తోడుగా కోరమండల్‌ వంటి సంస్థలు కూడా తమ సిఎస్‌ఆర్‌ నిధులతో అభివృద్ధికి సహకరించడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. సాంఘిక సంక్షేమహాస్టళ్లను ఆధునిక హంగులతో తీర్చిదిద్ది, అన్ని సౌకర్యాలు కల్పించిన కోరమండల్‌ సంస్థను అభినందించారు. వీటిని సద్వినియోగం చేసుకుని, విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. జిల్లాలో కోరమండల్‌ సంస్థ రెండు హాస్టళ్లను, దివీస్‌ మరో రెండు హాస్టళ్ల అభివృద్ధి చేస్తోందని, మరో ఆరు హాస్టళ్ల అభివృద్ధికి మరిన్ని సంస్థలు ముందుకు రావాలని కలెక్టర్‌ కోరారు.
ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందన్నారు. రెండు హాస్టళ్లను అధునాతనంగా అభివృద్ధి చేసిన కోరమండల్‌ సంస్థను అభినందించారు. స్థానిక కార్పొరేటర్‌ వంశీరెడ్డి మాట్లాడుతూ నేడు కార్పొరేట్‌ పాఠశాలలతో ప్రభుత్వ విద్యాసంస్థలు పోటీపడుతున్నాయంటే అది సిఎం జగన్‌ కృషి ఫలితమేనన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి తిప్పల దేవన్‌ రెడ్డి, లో డిసిఎంఎస్‌ చైర్‌పర్సన్‌ పల్లా చినతల్లి, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రమణమూర్తి, కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.జ్ఞానసుందరం, హైదరాబాద్‌ సిఎస్‌ఆర్‌ హెడ్‌ అమృతశ్రీవాత్సవ , డిఐసి జనవరి మేనేజర్‌ గణపతి, జిల్లా కోపరేటివ్‌ ఆఫీసర్‌ మిల్టన్‌, వార్డెన్‌ అలివేలు మంగ, వార్డు అధ్యక్షులు ఎన్‌వై నాయుడు పాల్గొన్నారు..