Feb 25,2023 23:27

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మల్లికార్జున

ప్రజాశక్తి - భీమునిపట్నం : స్థానిక బీచ్‌ రోడ్డులోని ప్రభుత్వ సమీకృత బాలికల వసతి గృహం ఆధునికీకరణ పనులను కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున శనివారం పరిశీలించారు. మండలంలోని చిప్పాడ దివీస్‌ సంస్థ సిఎస్‌ ఆర్‌ నిధులు రూ.59.17 లక్షలతో ఈ హాస్టల్‌లో ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. ప్రవేశ ద్వారం నుంచి వసతి గృహం వరకు రోడ్డు నిర్మాణం, భవనాల కిటికీలు, తలుపులు, మరుగుదొడ్లు, తాగునీటి పైపుల పునరుద్ధరణ పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా హాస్టల్‌ భవనాల స్థితిగతులు, సదుపాయాలపై బిసి సంక్షేమ అధికారులతో సమీక్షించారు.. జిల్లాలో వసతి గృహాల ఆధునికీకరణ, సౌకర్యాల కల్పనకు ముందుకొచ్చిన దివీస్‌, కోరమండల్‌ ఫెర్టిలైజర్స్‌, హెచ్‌పిసిఎల్‌ యాజమాన్యాలను కలెక్టర్‌ అభినందించారు.
ఈ సందర్భంగా దివీస్‌ సంస్థ డైరెక్టర్‌ మధుసూదనరావు మాట్లాడుతూ, రూ 2.50 కోట్ల సిఎస్‌ఆర్‌ నిధులతో జిల్లాలో పది హాస్టళ్లను ఆధునికీకరిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ ఎస్‌.భాస్కరరెడ్డి, , జివిఎంసి జోనల్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాము, తహశీల్దార్‌ కోరాడ వేణుగోపాల్‌, ఎంపిడిఒ పి వెంకటరమణ, జిల్లా బిసి సంక్షేమ అధికారులు (రూరల్‌, అర్బన్‌) కె శ్రీదేవి, ఎస్‌.వసంతకుమారి, అసిస్టెంట్‌ బిసి వెల్ఫేర్‌ ఆఫీసర్‌ జె జ్యోతిశ్రీ, వసతి గృహ సంక్షేమాధికారి సుజాత పాల్గొన్నారు