Oct 05,2023 00:44

నీరు పోసి పాదయాత్ర బృందానికి స్వాగతం పలుకుతున్న మహిళలు

ప్రజాశక్తి - తాడేపల్లి : సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాచైతన్య పాదయాత్ర తాడేపల్లిలో రెండోరోజైన బుధవారం ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర బృందానికి వివిధ సెంటర్లలో ప్రజలు హారతులు పడుతూ... పూలు జల్లుతూ స్వాగతం పలికారు. వివిధ సమస్యలపై అర్జీలను పాదయాత్ర బృందానికి అందజేశారు. ముందుగా ఉదయం ప్రకాష్‌నగర్‌ సెంటర్‌లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి తెల్లక్వారీ మీదుగా ఎమ్మెల రామయ్య కాలనీ పాదయాత్ర చేరుకుంది. రోడ్లు, డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉందని నాయకుల దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. అక్రమ కేసులు, అరెస్టులు, ప్రభుత్వ దమనకాండను అధిగమించి నిర్మితమైన ఈ కాలనీలో ఇంతవరకు ఈ కాలనీలో ఇళ్లపట్టాలు ఇవ్వలేదని అర్జీ అందజేశారు.
అక్కడ నుంచి నులకపేట మీదుగా సాయిబాబా గుడి వద్ద పాత తాడేపల్లి పట్టణంలోకి పాదయాత్ర బృందానికి పెద్దఎత్తున స్వాగతం పలికారు. ముస్లిం మైనార్టీలతో పాటు దళితులు అక్కడకు చేరుకుని పాదయాత్ర బృందంపై పూలు జల్లుతూ పట్టణంలోని ఆహ్వానించారు. ముగ్గురోడ్డు సెంటర్‌ మీదుగా రన్నింగ్‌ రూమ్‌ సెంటర్‌ పాదయాత్ర చేరుకుంది. అక్కడ మహిళలు బొట్టు పెట్టి హారతులు ఇచ్చి పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం వద్ద పాదయాత్ర బృందం ముందు బిందెలతో నీరు పోసి స్వాగతించారు. అక్కడ ఉన్న ఏకలవ్య, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి పాదయాత్ర ముందుకు సాగింది. ప్రజల కోసం జెండాలు ఎత్తి ప్రజల కోసం ప్రాణాలిచ్చిన మేకా అమరారెడ్డి, బండారు ముత్యాలు, వెన్నపూస మాలకొండారెడ్డి విగ్రహాలకు అమరారెడ్డి చౌక్‌ స్థూపం వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, ఎం.రవి, వై.నేతాజీ పూలమాలలు వేశారు. వెంకయ్య కొట్టు, పోతురాజుస్వామి గుడి సెంటర్లలో పూలు జల్లి స్వాగతం పలికారు.
అనంతరం గత 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న రైల్వే స్థలాలకు పట్టాలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. కనీసం ఇంటి పైకప్పులు పాడైపోయినా అధికారులు కట్టుకోనివ్వడంలేదని వాపోయారు. ఈ స్థలాలను ప్రభుత్వం కొనుగోలు చేసి రెవెన్యూ స్థలాలుగా మార్చి తాము ఉన్నచోటనే తమకు పట్టాలు ఇవ్వాలని అర్జీ అందజేశారు. అక్కడ నుంచి సిపిఎం పాదయాత్ర నెహ్రుబొమ్మ సెంటర్‌ మీదుగా బోసుబొమ్మ సెంటర్‌కు చేరుకుంది. బోసుబొమ్మ సెంటర్‌లో స్థానికులు పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. అక్కడ ఉన్న నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోసుబొమ్మ సెంటర్‌ నుంచి కొండచుట్టూ ఉన్న కొండ ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజల ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ సౌకర్యం కల్పించాలని కోటి రామ్మూర్తి ఆధ్వర్యంలో ప్రజల వినతిపత్రాన్ని అందజేశారు. గత 20 ఏళ్ల నుంచి కొండ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు నిలిపిపోవడంతో ఈ ప్రాంతంలో అమక్మకాలు కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా తమ స్థిరాస్తులు వివిధ శుభకార్యాలకు ఇంటి అవసరాలు తీర్చుకునేందుకు అమ్ముకోవాలంటే సాధ్యం కావడంలేదని ప్రజలు సిపిఎం పాదయాత్ర దృష్టికి తీసుకొచ్చారు.
ఉండవల్లి సెంటర్‌ మీదుగా పాదయాత్ర సీతానగరంలోకి ప్రవేశించింది. పాదయాత్ర బృందం ప్రభుత్వాసుపత్రిని సందర్శించింది. ఆసుపత్రిలో అవుట్‌ పేషెంట్‌ రోగులున్నా వైద్యులు లేరని పాదయాత్ర బృందానికి తెలిపారు. ప్రభుత్వం ఇటీవల ఆరోగ్య సురక్ష మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయడంతో డాక్టర్లు అటు తరలివెళ్లినట్లు రోగులు సిపిఎం నాయకులకు తెలిపారు. తాడేపల్లి ఆసుపత్రికి ప్రతిరోజూ సుమారు 150 నుంచి 170 మంది ఒపి ఉంటుంది.
ఈ సందర్భంగా పాదయాత్ర బృందం నాయకులు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష శిబిరాలకు వేరే డాక్టర్ల బృందాన్ని కేటాయించాలన్నారు. తాడేపల్లి ప్రభుత్వాసుపత్రిలో ప్రతిరోజూ డాక్టర్లు ఉండే విధంగా చర్యలు తీసుకుని ఓసీ సక్రమంగా జరిగే విధంగా చూసి రోగులకు అసౌకర్యం కలగకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్ర బృందం సాయంత్రం మహానాడు, సుందరయ్యనగర్‌ ప్రాంతాల్లో పర్యటించింది. ముఖ్యంగా మహానాడులో కృష్ణానదికి రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలని అర్జీ అందజేశారు. కృష్ణానదికి వరదలు వస్తే తాము ఇళ్లల్లోంచి బయటకు వెళ్లాల్సి వస్తుందని స్థానికులు పాదయాత్ర బృందానికి తెలిపారు. కృష్ణానదికి విజయవాడ వైపు నిర్మించినట్లు రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తే తమ ఇళ్లల్లో తాము సురక్షితంగా ఉండగలుగుతామని చెప్పారు. ఇళ్లపట్టాలు, రోడ్లు, డ్రెయినేజీ సమస్య పట్టిపీడిస్తుందని వినతిపత్రాలు అందజేశారు. డ్రెయినేజీ అస్తవ్యస్తంగా మారడంతో ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు. దుర్వాసనతో ఆహారం కూడా తినలేకపోతున్నామని వాపోయారు. ఇళ్ల ముందు పెద్దఎత్తున మురుగు నిలబడి విష కీటకాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ మూడు పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలి
పాదయాత్రలో భాగంగా పలుచోట్ల జిల్లా కార్యదర్శి పాశం రామారావు, నాయకులు ఎం.సూర్యారావు, ఎం.రవి, వై.నేతాజీ, బి.వెంకటేశ్వర్లు, వి.దుర్గారావు మాట్లాడారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని పోటీలు పడి రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, ప్రశ్నిస్తానన్న జనసేన ఎందుకు మద్దతు ఇస్తున్నాయో తెలపాలని డిమాండ్‌ చేశారు. విభజన హామీల చట్టంలోని ఏ ఒక హామీని అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో దోస్తి ఎందుకని ప్రశ్నించారు. విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు తదితర హామీలన్నీ తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులకు భయపడి అధికారం వస్తుందోమోనని ఆశపడి బిజెపి వెంట వెళ్తే ఆ పార్టీల మనుగడమే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా బిజెపితో విడగొట్టుకుని బయటకు రావాలన్నారు. చంద్రబాబు అరెస్టు తరువాతైనా టిడిపి కళ్లు తెరవాలని హితవు పలికారు. మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్లపట్టాల సమస్య తీవ్రంగా ఉందని, తాడేపల్లి పాదయాత్రలో ఇదే సమస్యను ఎక్కువ చోట్ల తమ దృష్టికి తీసుకొచ్చారని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఎక్కడుంటున్న వారికి అక్కడే పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ వైపు నుంచి ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, నాయకులు వి.వెంకటేశ్వరరావు, ఎం.భాగ్యరాజు, ఎస్‌ఎఫ్‌ఐ బాలాజీ, డి.శ్రీనివాసకుమారి, కె.కరుణాకరరావు, ఎ.శౌరిబర్తులం, డివి భాస్కరరెడ్డి, వై.బర్నబస్‌, బి.గోపాల్‌రెడ్డి, కె.రామకృష్ణ, ఎస్‌కె సుభాని, దేవెళ్ల శంకర్‌, నాగలక్ష్మి, ఎస్‌.ముత్యాలరావు, కె.బాబూరావు, జి.శ్రీనివాసరావు, సిహెచ్‌.శ్రీరామ్‌, పి.లక్ష్మణరావు, వి.సామ్యేలు, కె.మేరి, కె.ఉషారాణి, బి.రామారావు, లీలమ్మ, ఫిరోజ్‌ఖాన్‌, అయుబ్‌సెట్‌, ఎస్‌కె పీరూసాహెబ్‌ పాల్గొన్నారు.