Nov 06,2023 21:10

ఏజెన్సీలో ప్రజారక్షణ భేరి బస్సు యాత్రకు ఘన స్వాగతం
ఎదురెళ్లి స్వాగతం పలికిన మహిళలు, గిరిజనులు
నిర్వాసితుల, ఏజెన్సీ సమస్యలపై గళమెత్తిన నేతలు
జీలుగుమిల్లిలో ఆయుధ కర్మాగారం ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టతివ్వాలి
పునరావాస కాలనీల్లో వసతుల లేమిపై మండిపాటు
ప్రజాసమస్యలపై వినతుల వెల్లువ
జిల్లాలో తొలిరోజు కుక్కునూరు నుంచి కొయ్యలగూడెం వరకూ సాగిన సిపిఎం బస్సు యాత్ర
ప్రజాశక్తి - ఏలూరు జిల్లా యంత్రాంగం
సిపిఎం చేపట్టిన ప్రజారక్షణభేరి బస్సుయాత్రకు సోమవారం తొలిరోజు జిల్లాలో ఘనస్వాగతం లభించింది. ఉదయం తొమ్మిది గంటలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నేతృత్వంలో కుక్కునూరులో ప్రారంభమైన బస్సు యాత్ర వేలేరుపాడు, జీలుగుమిల్లి, రెడ్డిగణపవరం, రామారావుపేట, బుట్టాయగూడెం, కన్నాపురం, పోలవరం మీదుగా కొయ్యలగూడెం వరకూ సాగింది. యాత్ర బృందానికి జనం ఎదురేగి స్వాగతం పలకడమే కాకుండా మహిళలు హారతులిచ్చి, తిలకం దిద్ది ఆహ్వానించారు. గిరిజన నృత్యాలతో సభావేదిక వద్దకు నాయకులను తోడ్కొని వెళ్లారు. యాత్రలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సురేంద్ర, వి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, అశోక్‌, రాష్ట్ర నాయకులు ఎం.సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి ఎ.రవి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.నాగమణి, డిఎన్‌విడి.ప్రసాద్‌, తెల్లం రామకృష్ణ, జిల్లా నాయకులు కె.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి మండల కేంద్రంలో సభ నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను తూర్పారబట్టారు. కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పలు సభల్లో మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగట్టారు. నిర్వాసితుల సమస్యలపై పాదయాత్ర చేపట్టి దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేసిన పార్టీ సిపిఎం ఒక్కటేనన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వైసిపి, టిడిపి, జనసేనలు కేంద్రంలోని బిజెపికి దాసోహమయ్యాయని విమర్శించారు. జీలుగుమిల్లిలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఆయుధ కర్మాగారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నాణ్యత, అవినీతిపై న్యాయవిచారణ చేపట్టి దోషులను శిక్షించాలని కోరారు. బుట్టాయగూడెం సభలో వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒకరు మరోసారి సిఎం పదవి కావాలని, మరొకరు ఇంకోసారి అవకాశం ఇవ్వాలని ముందుకొస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నూరుశాతం హామీలు అమలు చేశామని జగన్‌ చెబుతున్నారని, అలా అయితే కరువు పరిస్థితులు ఎందుకొచ్చాయని, స్కీమ్‌ వర్కర్లు జీతాల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వాహనం ఎక్కితే శరీరం గుల్లవుతుందన్నారు. పోలవరం ఎంఎల్‌ఎ నియోజకవర్గంలో రోడ్లు వేయలేకపోవడమేకాక, తాగునీరు కూడా ఇవ్వలేదన్నారు. నిర్వాసితుల కాలనీల్లో తాగునీరు, ఆసుపత్రులు వంటి సదుపాయాలేవీ లేవన్నారు. ఈ ప్రభుత్వం ఇసుక దొంగలకు, భూస్వాములకు, కాంట్రాక్టర్లకు అండగా నిలిచిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీలు, ఆశాల జీతాలు పెంచలేదన్నారు. పేదలకు అండగా ఉండేది సిపిఎం మాత్రమేనని, ప్రజలను చైతన్యపర్చేందుకే బస్సుయాత్ర చేపట్టామన్నారు. బిజెపి రాష్ట్రానికి ద్రోహం చేసిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదన్నారు. సిపిఎం తరపున ఐదుగురు ఎంఎల్‌ఎలు గెలిచినా పేదల పక్షాన ధీటుగా పోరాడుతుందన్నారు. వేలేరుపాడు సభలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఎండగట్టారు. కుక్కునూరు సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి తమకు సంబంధం లేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రోజుకోమాట మాట్లాడుతుందన్నారు. ముంపు మండలాల్లో అభివృద్ధిని కొనసాగించాలన్నారు. ఉపాధి హామీ పనులకు ఏడాదికి రూ.రెండు లక్షల కోట్లు కేటాయించాల్సి ఉండగా రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించి నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు. కుక్కునూరు సభకు మండల కార్యదర్శి వై.నాగేంద్రరావు, వేలేరుపాడు సభకు మండల కార్యదర్శి ధర్ముల రమేష్‌, జీలుగుమిల్లిలో సభకు మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు, బుట్టాయగూడెం సభకు మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, పోలవరంలో సభకు మండల కార్యదర్శి గుడెల్లి వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఈ సభలకు సిపిఎం నాయకులు, కార్యకర్తలు, గిరిజనులు, ప్రజలు పెద్దఎత్తున తరలొచ్చారు.