ప్రజాశక్తి-గాజువాక
ఉద్యోగ, ఉపాధ్యాయుల సిపిఎస్, జిపిఎస్‌లను రద్దు చేసి ఒపిఎస్ అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ హామీని నిలబెట్టుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేఎం శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం గాజువాక తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలోధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని సిఎం జగన్ ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత అటకెక్కించడం దారుణమన్నారు. దీనిపై ప్రశ్నించి, ఆందోళన చేయాలనుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయులను నిర్ధాక్షిణ్యంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
సిపిఐ కార్యదర్శి కె.సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగులకు అండగా ఉంటామన్న ముఖ్యమంత్రి, వారిని నెలసరి జీతాలను సక్రమంగా ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. సిపిఎం జోన్ కార్యదర్శి ఎం రాంబాబు మాట్లాడుతూ తమ హక్కులపై ప్రశ్నించే ఉద్యోగ, ఉపాధ్యాయులను నిర్బందాలకు గురిచేయడం సరికాదని, రానున్న రోజుల్లో దీనిపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. సిపిఎం నేతలు ఎన్ రాజేంద్రప్రసాద్, ఎ.అయోధ్యరాం, అంగా లోకేష్, వై లక్ష్మణరావు, కె.సంతోషం, జి లక్ష్మి, ఎం.శ్రీదేవి కొవ్వూరు అప్పలరాజు, కె.కిరీటం, సిపిఐ నేతలు పల్లెటి పోలయ్య, ఎల్లేటి శ్రీనివాస్, ప్రజా సంఘాల నేతలు యమ జ్యోతి రాజశేఖర,్ కె.రమణ, సిఐటియు నేత ఎన్ రామారావు. పాల్గొన్నారు.
పెందుర్తి: సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తుంటే, వాటిని నెరవేర్చకుండా వేధింపులకు గురిచేయడమే కాకుండా, అసలు నెలసరి జీతాలకు ఎసరు పెట్టేలా సిఎం జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్నారని సిపిఎం, సిపిఐ నేతలు మండిపడ్డారు. శుక్రవారం స్థానిక రైతుబజారు వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్శహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గసభ్యులు జగన్, జిల్లా కమిటీ నాయకులూ బి.రమణి వారంరోజుల్లో సిపిఎస్ రద్దు హామీ నాలుగేళ్లు దాటినా అమలు చేయలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నుంచి కార్యకర్త వరకు వైసిపి నేతల అవినీతి పనులకు సహకరించని ఉద్యోగులను వేధించడం దుర్మార్గమన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిల చెల్లింపు, ఇతర అన్ని హామీలు అమలు చేయకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు రాంబాబు, వామపక్ష కార్యకర్తలు పాల్గొన్నారు.
కె.కోటపాడు :ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించి, తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల జిల్లా నాయకులు గండి నాయనబాబు, వేచలపు కాసుబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులపై నిర్బంధాన్ని విడనాడి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, రూ.16,500 కోట్ల డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం తహశీల్దారు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు గొర్లే దేవుడు బాబు, రొంగలి ముత్యాల నాయుడు, ఎర్రా దేముడు, వనము సూర్యనారాయణ , గాడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి : సిపిఐ ఆధ్వర్యాన స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ సిపిఎస్ విధానం రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు పాల్గొంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించడం దుర్మార్గమన్నారు. ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వం వాలంటీర్లను ఎందుకు ఉపయోగించుకుంటుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాకిరెడ్డి రామునాయుడు, కోన లక్ష్మణ, గొర్లి దేవుడు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేమల కన్నబాబు, వియ్యపు రాజు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్ర, విత్తనాల పోతురాజు, నరాలశెట్టి సత్యనారాయణ, కొల్లి సత్యారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










